మినీ ఐలాపూర్ జాతరకు.. దారేది?
- 2027లో సమ్మక్క–సారలమ్మ జాతరకు వేలాదిగా భక్తులు
- శాశ్వత రహదారి లేక అవస్థలు.. వర్షాకాలంలో వాగులతో బందీ
- గర్భిణీలు, బాలింతలకు తప్పని తిప్పలు
- ఎమర్జెన్సీ వేళ ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందేనా?
కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ : మండలానికి అమడ దూరంలో ఉన్న ఐలాపూర్ గ్రామంలో 2027లో సమ్మక్క–సారలమ్మ మినీ ఐలాపూర్ జాతర జరగనుంది. ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే ఈ జాతరకు వేలాది మంది భక్తులు తరలివచ్చి వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. తమ మొక్కులు చెల్లిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అయితే.. వేలాది మంది భక్తులు వచ్చే జాతరకు దారి మాత్రం సరిగ్గా లేకపోవడం ఐలాపూర్ ప్రజలకు శాపంగా మారింది. గ్రామానికి ఇప్పటికీ శాశ్వత రహదారి లేకపోవడంతో వర్షాకాలంలో పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది.
వాగులు పొంగితే.. గ్రామం బందీ..
వర్షాలు కురిసినప్పుడు ఐలాపూర్ చుట్టూ ఉన్న వాగులు పొంగిపొర్లుతాయి. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అత్యవసర సమయంలో కూడా గ్రామం నుంచి బయటకు వెళ్లడం కష్టంగా మారుతోంది. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైనా అనారోగ్యానికి గురైనా.. గర్భిణీకి అత్యవసర పరిస్థితి వచ్చినా ఆసుపత్రికి తరలించడం కత్తిమీద సాములా మారుతోందని గ్రామస్తులు వాపోతున్నారు.
ముగ్గురు మృతి.. అయినా చలనం లేదా
రహదారి, రవాణా సౌకర్యాల కొరత కారణంగా గతంలో అత్యవసర పరిస్థితుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనలు చోటుచేసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. అయినా సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జాతరకు ముందే మేల్కొనాలి
2027లో మినీ ఐలాపూర్ జాతర జరగనున్న నేపథ్యంలో అధికారులు ఇప్పటి నుంచే కార్యాచరణ చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. జాతర సమయంలో తాత్కాలిక ఏర్పాట్లు చేసి చేతులు దులుపుకోవడం కాకుండా శాశ్వత రహదారి, వాగులపై వంతెనలు నిర్మించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. వేలాది మంది భక్తులు వచ్చే జాతరకు రహదారి లేకపోవడం.. అత్యవసర వేళ ప్రాణాలకు ముప్పు ఉండటం.. ఇకనైనా అధికారుల కళ్లకు కనిపిస్తుందా? అని ఐలాపూర్ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
