హసీనాను హతమార్చిన దుర్మార్గుడికి కఠిన శిక్ష పడాలి: ఎమ్మెల్యే ప్రత్తిపాటి

చిలకలూరిపేట, ఆంధ్రప్రభ: బీటెక్ పూర్తిచేసి ఉద్యోగం చేస్తూ కుటుంబానికి అండగా నిలిచిన మైనారిటీ యువతి షేక్ హసీనాను ప్రేమోన్మాది బాలసైదులు దారుణంగా హత్య చేయడం అత్యంత బాధాకరమని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆవేదన వ్యక్తం చేశారు.

మంగళవారం చిలకలూరిపేట 38వ వార్డులోని హసీనా నివాసానికి వెళ్లిన ప్రత్తిపాటి, ఆమె తల్లిదండ్రులు రిహానా, మస్తాన్‌లను పరామర్శించి ఓదార్చారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని, నిందితుడికి చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

నాలుగేళ్లుగా ప్రేమ పేరుతో హసీనాను వేధించిన బాలసైదులు, మాట్లాడాలని మభ్యపెట్టి ఆమెను కారంపూడి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో పొడిచి, పెట్రోల్ పోసి దహనం చేశాడని ప్రత్తిపాటి తెలిపారు. అనంతరం పరారైన నిందితుడిని పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపారని చెప్పారు.

“ఇంతటి దారుణానికి పాల్పడిన బాలసైదుల్ని ఎన్‌కౌంటర్ చేసినా తప్పులేదు. అయితే చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు” అని ప్రత్తిపాటి అన్నారు. నిందితుడికి ఉరిశిక్ష పడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.

హసీనా కుటుంబానికి న్యాయం జరిగేలా ఘటనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. నిందితుడిని సకాలంలో పట్టుకున్న పోలీసులను అభినందించారు. “నా బిడ్డను చంపిన దుర్మార్గుడికి ఉరిశిక్ష వేయాలి. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి” అని హసీనా తల్లి రిహానా కన్నీరుమున్నీరయ్యారు. తండ్రి మస్తాన్ కూడా నిందితుడికి కఠిన శిక్ష విధించాలని కోరారు.