అమెరికాతో వాణిజ్య ఒప్పందం.. రైతాంగానికి తీవ్ర నష్టం

  • వ్యవసాయం గిట్టుబాటు కాదు.. కేంద్రం నుంచి తగిన సాయం లేదు
  • అమెరికాలో రైతు కుటుంబానికి 362 పాడి పశువులు..
  • భారత్‌లో మూడు మాత్రమే : వి. రాంభూపాల్‌

యడ్లపాడు, ఆంధ్రప్రభ: అమెరికాతో ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల భారత రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ప్రజాశక్తి డిప్యూటీ ఎడిటర్‌ వి. రాంభూపాల్‌ అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులు పెరిగితే దేశీయ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించక తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు.

యడ్లపాడులోని పి.ఆర్‌. విజ్ఞాన కేంద్రంలో కామ్రేడ్‌ పోపూరి రామారావు ఏడో వర్ధంతి సందర్భంగా “అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు–భారత రైతాంగంపై ప్రభావం” అనే అంశంపై మంగళవారం సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన వి. రాంభూపాల్‌ మాట్లాడుతూ పోపూరి రామారావు నిజాయితీ, నిబద్ధతకు మారుపేరుగా నిలిచిన ప్రజా నాయకుడని కొనియాడారు.

రైతులు, ప్రజల సమస్యలపై ఆయన నిరంతరం పోరాడారని, ఏడేళ్లు గడిచినా ప్రజలు ఆయనను మరువలేకపోతున్నారని అన్నారు. ప్రస్తుత దేశ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని పేర్కొంటూ, రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమాల్లో పాల్గొంటున్నారని తెలిపారు.

దిగుమతులతో దేశీయ రైతులకు నష్టం

అమెరికాతో కుదుర్చుకునే వాణిజ్య ఒప్పందంలో వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులకు ప్రాధాన్యం ఇస్తే భారతదేశంలోని రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని రాంభూపాల్‌ అన్నారు. అమెరికాలో వ్యవసాయ ఉత్పత్తులపై అధిక వ్యయం ఉన్నప్పటికీ అక్కడి రైతులకు భారీగా ప్రభుత్వ రాయితీలు అందుతున్నాయని చెప్పారు.

అమెరికా నుంచి మొక్కజొన్న, వరి, పత్తి, సోయాబీన్‌ తదితర వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటే దేశీయ మార్కెట్లో రైతులు పండించిన పంటల ధరలు పడిపోయే ప్రమాదం ఉందన్నారు. దీని ప్రభావం కోట్లాది మంది రైతులపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

భారత్‌, అమెరికా వ్యవసాయ రంగాల్లో ఉన్న పరిస్థితుల్లో భారీ వ్యత్యాసం ఉందని తెలిపారు. అమెరికాలో రైతు కుటుంబాలకు పెద్ద మొత్తంలో భూమి, ప్రభుత్వ రాయితీలు అందుతున్నాయని, భారత రైతులు మాత్రం చిన్న కమతాలతో వ్యవసాయం చేస్తున్నారని వివరించారు.

రాయితీల్లో భారీ వ్యత్యాసం

అమెరికాలో సుమారు 24 లక్షల రైతు కుటుంబాలకు సగటున 464 ఎకరాల భూమి ఉంటుందని రాంభూపాల్‌ పేర్కొన్నారు. ఒక్కో రైతు కుటుంబానికి రాయితీల రూపంలో రూ.25,17,507 వరకు అందుతున్నాయని తెలిపారు. భారత్‌లో కోట్లాది రైతు కుటుంబాలు సగటున రెండున్నర ఎకరాల భూమితో వ్యవసాయం చేస్తుండగా, ప్రభుత్వ రాయితీలు చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు.

మొక్కజొన్న ఉత్పత్తిలో ఒకప్పుడు వెనుకబడిన అమెరికా.. రైతులకు అందిస్తున్న ప్రభుత్వ ప్రోత్సాహకాలతో ప్రస్తుతం ప్రపంచంలో అగ్రస్థానానికి చేరిందని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను భారత్‌లోకి స్వేచ్ఛగా అనుమతిస్తే దేశీయ రైతులు పోటీని తట్టుకోలేరని అన్నారు.

రైతులకు రక్షణ కల్పించాలి

1969లో రైతుల పోరాటాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారత ఆహార సంస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని రాంభూపాల్‌ అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర, మార్కెట్‌ రక్షణ, పంట బీమా, పెట్టుబడి రాయితీలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

అమెరికాతో కుదుర్చుకునే ఒప్పందాలపై ప్రజల్లో విస్తృత చర్చ జరగాలని అన్నారు. రైతులు, కార్మికులకు నష్టం కలిగించే నిబంధనలను వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

రైతు సంఘాలు ఏకమై పోరాడాలి

పల్నాడు జిల్లా రైతు సంఘం కార్యదర్శి ఏపూరి గోపాలరావు మాట్లాడుతూ ప్రతికూల వాణిజ్య ఒప్పందాల వల్ల రైతులు, కార్మికులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. భవిష్యత్తులో పాలు, బంగాళాదుంపలు వంటి ఉత్పత్తులను కూడా రైతులు గిట్టుబాటు ధరకు విక్రయించలేని పరిస్థితి రావచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతే రాజు అని చెబుతున్నప్పటికీ ఎరువుల కోసం రైతులు పలు నిబంధనలను ఎదుర్కోవాల్సి వస్తోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాలు ఐక్యంగా పోరాడితే రైతుల హక్కులను కాపాడుకోవచ్చని అన్నారు.

రైతుల కోసం పోరాడిన పోపూరి రామారావు

ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతుల సంఘం అధ్యక్షుడు రాధాకృష్ణ మాట్లాడుతూ 70 ఏళ్ల వయసులోనూ పోపూరి రామారావు రైతుల సమస్యలపై పోరాటాలు కొనసాగించారని గుర్తుచేశారు. గుంటూరు మిర్చి యార్డులో రైతులకు అనుకూలంగా నిర్వహించిన ఆందోళనలో ఆయన అరెస్టయ్యారని తెలిపారు.

కార్యక్రమానికి తాళ్లూరి రామారావు అధ్యక్షత వహించారు. తొలుత కామ్రేడ్‌ పోపూరి రామారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

కార్యక్రమంలో సీపీఎం సీనియర్‌ నాయకులు నూతలపాటి కాళిదాసు, ఆలోకం పెద్దబ్బాయి, చెరుకూరి సత్యనారాయణ, సీఐటీయూ పల్నాడు జిల్లా కార్యదర్శి ఆంజనేయ నాయక్‌, సీపీఎం పల్నాడు జిల్లా కార్యదర్శి జి. విజయ్‌కుమార్‌, నారాయణ పాఠశాల డైరెక్టర్‌ సృజనతో పాటు మూడు మండలాల నాయకులు, రైతు నాయకులు, రైతులు, విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.