సూపర్‌ మార్కెట్‌పై ఎక్సైజ్‌ పోలీసుల దాడి

బెల్లం, పటిక స్వాధీనం.. ఒకరిపై కేసు నమోదు

నర్సింహులపేట, ఆంధ్రప్రభ: గుడుంబా తయారీకి ఉపయోగించే ముడి సరుకును విక్రయానికి సిద్ధంగా ఉంచిన సూపర్‌ మార్కెట్‌పై ఎక్సైజ్‌ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా బెల్లం, చక్కెరతో పాటు గుడుంబా తయారీలో ఉపయోగించే పౌడర్‌ను స్వాధీనం చేసుకుని ఒకరిపై కేసు నమోదు చేసినట్లు తొర్రూర్‌ ఎక్సైజ్‌ సీఐ అశోక్‌ తెలిపారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని వంశీ సూపర్‌ మార్కెట్‌లో గుడుంబా తయారీకి ఉపయోగించే ముడి సరుకు నిల్వ చేసినట్లు సమాచారం అందింది. దీంతో ఎక్సైజ్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో విక్రయానికి సిద్ధంగా ఉంచిన 2 క్వింటాళ్ల నల్లబెల్లం, క్వింటా చక్కెర, 12 కిలోల గుడుంబా తయారీకి ఉపయోగించే పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. సూపర్‌ మార్కెట్‌ యజమాని నరేష్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

ఈ తనిఖీల్లో ఎస్‌ఐ శంకర్‌, సిబ్బంది మధు, ప్రభాకర్‌, వెంకటస్వామి పాల్గొన్నారు.