జగన్ కర్నూలు పర్యటనను విజయవంతం చేయాలి

  • వైసీపీ శ్రేణులకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పిలుపు
  • నందికొట్కూరులో కార్యకర్తల సమావేశం
  • కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

నందికొట్కూర్ , ఆంధ్రప్రభ: వైఎస్సార్‌సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈనెల 13వ తేదీన కర్నూలు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆ పర్యటనను అపూర్వంగా విజయవంతం చేయాలని పార్టీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా మంగళవారం నందికొట్కూరులోని వైసీపీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

13వ తేదీన జగనన్న కర్నూలుకు వస్తున్నారని ఆ కార్యక్రమానికి నందికొట్కూరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్లి విజయవంతం చేయాలని ఈ సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

హామీలు నెరవేర్చడం చేతకాక వైసీపీ శ్రేణులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మండిపడ్డారు. అక్రమ అరెస్టులు చేయడమే పనిగా పెట్టుకున్నారని, ప్రజా సమస్యలను గాలికొదిలేశారని విమర్శించారు.జగనన్న పాలనలో జరిగిన సంక్షేమం అభివృద్ధిని ప్రజలకు మరోసారి గుర్తుచేయాలని 13వ తేదీ కార్యక్రమానికి ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు అభిమానులు స్వచ్ఛందంగా తరలిరావాలని సిద్ధార్థ రెడ్డి కోరారు.

జగనన్న రాకతో కర్నూలు జిల్లాలో మళ్లీ వైసీపీ జోష్ పెరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ ముఖ్య నాయకులు, మండల అధ్యక్షులు, యువజన విభాగం నాయకులు, మహిళా విభాగం నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.