చింతా ప్రభాకర్‌పై కాంగ్రెస్ నేతల ఆరోపణలు

కబ్జాల అంశంపై బహిరంగ చర్చకు సవాల్

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌పై కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. జగ్గారెడ్డిపై విమర్శలు చేసే ముందు తన గతాన్ని గుర్తు చేసుకోవాలని సూచిస్తూ, కబ్జాల అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా మంగళవారం సాయంత్రం సంగారెడ్డి పట్టణంలోని ఐబీ ప్రాంగణంలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎమ్మెల్యే తన సోదరుడితో కలిసి భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. భార్య పేరుపై ఎనిమిది ఎకరాల సీలింగ్ భూమిని రిజిస్ట్రేషన్ చేసి విక్రయించారనే ఆరోపణలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

దళితుల భూములను ఆక్రమించారని, సదాశివపేటలో రహదారులను కబ్జా చేశారని ఆరోపించారు. మున్సిపల్ చైర్మన్‌గా ఉన్న సమయంలో మాలకుంటను ఆక్రమించి అక్కడ ఇల్లు నిర్మించుకున్నారనే ఆరోపణలను కూడా ప్రస్తావించారు. ఈ అంశాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నిస్తూ, సదాశివపేటలో ఎక్కడికి రమ్మన్నా చర్చకు వస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.

జగ్గారెడ్డిపై వ్యాఖ్యలకు ఆగ్రహం

జగ్గారెడ్డిపై చింతా ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. జగ్గారెడ్డి సహకారంతో రాజకీయంగా ఎదిగిన వారు ఆయనపై విమర్శలు చేయడం సరికాదన్నారు. జగ్గారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.

అభివృద్ధి కార్యక్రమాల ప్రస్తావన

సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కూడా కాంగ్రెస్ నాయకులు స్పందించారు. ఐఐటీ, ఇంటింటికీ మంజీరా నీరు, సంగారెడ్డి-లింగంపల్లి నాలుగు లేన్ల రహదారి, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, అగ్రికల్చర్ కాలేజీ, పీజీ కాలేజీ వంటి అభివృద్ధి కార్యక్రమాలను జగ్గారెడ్డి తీసుకువచ్చారని పేర్కొన్నారు. కరోనా సమయంలో ప్రజలకు ఆక్సిజన్ సిలిండర్లు అందించి అండగా నిలిచారని తెలిపారు.

అక్రమాల వివరాలు బయటపెడతామని హెచ్చరిక

బీఆర్ఎస్ నాయకుల అవినీతి, అక్రమాలకు సంబంధించిన వివరాలను దశలవారీగా ప్రజల ముందుకు తీసుకువస్తామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌పై వచ్చిన ఆరోపణలకు ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో నియోజకవర్గ కన్వీనర్ చేర్యాల ఆంజనేయులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, సీడీసీ చైర్మన్ రామ్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మునిపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్, షఫీ హఫీజ్, కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.