కూలిందా.. కూలగొట్టారా
శాయంపేట గ్రామపంచాయతీలో పగిలిపోయి ఉన్న శిలాఫలకం
ఇది ఇష్యూ కాదంటూ పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యపు సమాధానం
హనుమకొండ/శాయంపేట, ఆంధ్రప్రభ : మేజర్ గ్రామపంచాయతీ అయిన శాయంపేట మండల కేంద్రంలో 2023లో అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, అప్పటి జడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణం కోసం రూ.20 లక్షల నిధులు మంజూరు చేస్తూ శిలాఫలకాన్ని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు.
అయితే ఆ శిలాఫలకం మంగళవారం కిందపడి పగిలిపోయి కనిపించడంతో కూలిందా.. కూలగొట్టారా అనే అనుమానాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. అధికారం లేదనే కారణంతో ఆ శిలాఫలకాన్ని కూలగొట్టారని కొందరు చర్చించుకుంటున్నారు.
దీనిపై పంచాయతీ కార్యదర్శి రాజారామ్‌ను వివరణ కోరగా.. ఇది పెద్ద విషయం కాదని, ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారంటూ విలేకరులను ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. దీనిపై మరింత వివరాలు అడగ్గా తాను విధుల్లో చేరి నాలుగు రోజులు మాత్రమే అవుతుందని, తనకు ఏమీ తెలియదంటూ సమాధానం ఇచ్చినట్లు సమాచారం.
గండ్ర వెంకటరమణారెడ్డి చలివాగు ప్రాజెక్టు ముట్టడికి వస్తుండటంతో శాయంపేటలో కూలిపోయిన శిలాఫలకం అంశం మండల కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది.
శిలాఫలకం కూలిందా.. కూలగొట్టారా అనే విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వడంతో పాటు, దానిని తిరిగి నిలబెడతారా.. అలాగే వదిలేస్తారా అనేది తేలాల్సి ఉంది. పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంపై బీఆర్‌ఎస్ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి శిలాఫలకాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు కోరుతున్నారు.
