రాజోలు టీడీపీ శ్రేణుల్లో జోష్..

కార్యకర్తల ఐక్యతపై అచ్చెన్నాయుడు ప్రశంసలు

రాజోలు, ఆంధ్రప్రభ: రాజోలు నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పార్టీ ఇన్‌చార్జి గొల్లపల్లి అమూల్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహం ప్రదర్శించారు.

కార్యకర్తల ఉత్సాహం, ఐక్యత చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అమరావతి నుంచి పోలవరం వరకు రాష్ట్రంలోని పలు వ్యవస్థలు దెబ్బతిన్నాయని అచ్చెన్నాయుడు విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర పునర్నిర్మాణం దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు.

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి చర్యలను చూసి వైసీపీ అబద్ధాలు, దుష్ప్రచారాలకు పాల్పడుతోందని ఆరోపించారు. మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రానికి పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని పేర్కొన్నారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేసి వేలాది ఉద్యోగాల భర్తీ చేపట్టిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని తెలిపారు.

రాజోలు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సూచనల మేరకు ఇన్‌చార్జి గొల్లపల్లి అమూల్య నాయకత్వంలో క్రమశిక్షణతో కొనసాగుతాయని అచ్చెన్నాయుడు చెప్పారు. నాయకులు, కార్యకర్తలు పదవుల కంటే పార్టీ సిద్ధాంతాలు, కూటమి ధర్మానికి ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.