శివారు భూములకు తొలుత సాగునీరు ఇవ్వాలి: వేదవ్యాస్‌

పెడన, ఆంధ్రప్రభ : పెడన, బందరు, అవనిగడ్డ, కైకలూరు నియోజకవర్గాల శివారు భూములకు సాగునీటి సరఫరాలో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్‌ బూరగడ్డ వేదవ్యాస్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

వ్యవసాయ అదును దాటిపోతున్నా సాగునీటి కొరత రైతులను వెంటాడుతోందని వేదవ్యాస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే నాట్లు పూర్తికావాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ, చాలా ప్రాంతాల్లో సాగునీరు అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ప్రస్తుతం పట్టిసీమ ద్వారా సాగునీరు అందించే ప్రయత్నం జరుగుతున్నందున ముందుగా శివారు, దిగువ ప్రాంతాల భూములకు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్‌ మంత్రిని కోరారు. ఎగువ భూములకు సాగునీటి సమస్య పెద్దగా ఉండదని, దిగువ ప్రాంత రైతులకు మాత్రం ప్రతి ఏటా నీటి ఎద్దడి సమస్య ఎదురవుతూనే ఉంటుందని వివరించారు.

ఈ నియోజకవర్గాల పరిధిలో వరి మినహా ప్రత్యామ్నాయ పంటలకు పెద్దగా అవకాశం లేదని, అందువల్ల టెయిల్‌ ఎండ్‌ ప్రాంతాలకు సకాలంలో సాగునీరు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.

తాను శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అన్ని శాఖలను సమన్వయం చేసి ప్రత్యేక చర్యలు చేపట్టి సాగునీరు అందించినట్లు వేదవ్యాస్‌ గుర్తుచేశారు.

పట్టిసీమతో రైతులకు ఊరట

పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించిన వైసీపీ నాయకులు.. ప్రస్తుతం అది పనిచేస్తున్న తీరును చూసైనా తమ వైఖరిని మార్చుకోవాలని వేదవ్యాస్‌ వ్యాఖ్యానించారు. ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పట్టిసీమ ప్రాజెక్టే రైతులకు అండగా నిలుస్తోందన్నారు.

రైతులను ఆదుకునేందుకు పట్టిసీమ ద్వారా సాగునీరు అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందించాల్సిందేనని పేర్కొన్నారు. పట్టిసీమ నిర్మాణం చంద్రబాబు ముందుచూపునకు నిదర్శనమని, ఆ ప్రాజెక్టు ఘనత ఆయనకే దక్కుతుందని వేదవ్యాస్‌ అన్నారు.