సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు
చలివాగు ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించాలని బీఆర్‌ఎస్ ధర్నా
రూపిరెడ్డిపల్లి-పరకాల రహదారిపై రాస్తారోకో..
రైతులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే గండ్ర
రేగొండ, ఆంధ్రప్రభ : చలివాగు ప్రాజెక్టు నుంచి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో రూపిరెడ్డిపల్లి-పరకాల, భూపాలపల్లి జాతీయ రహదారిపై నాలుగు గ్రామాల రైతులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరై బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ చలివాగు ప్రాజెక్టు నుంచి వెంటనే రైతులకు సాగునీరు అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు పూర్తయినా ఇప్పటివరకు చలివాగు ప్రాజెక్టు నుంచి సాగునీరు అందించకపోవడంతో రైతులు వరినారు సాగు చేయలేని దుస్థితి నెలకొందన్నారు.
వందలాది మంది రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల బాధలను గుర్తించి వెంటనే సాగునీరు అందించాలని కోరారు. చలివాగు ప్రాజెక్టు తూములు ఎత్తి నీటిని విడుదల చేసి ఆయకట్టు ప్రాంతంలోని పంట పొలాలకు సాగునీరు అందించాలని గత 15, 20 రోజులుగా కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
చలివాగు నుంచి మోటార్ల ద్వారా నీటిని పైకి తీసుకెళ్తున్నా ఆయకట్టు పంట పొలాలకు నీరు అందడం లేదన్నారు. దీంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. రైతులు నార్లు పోసి 45 రోజులు దాటినా నీరు అందకపోవడంతో నాట్లు వేసుకునేందుకు ఎదురుచూస్తున్నారని చెప్పారు.
సాగునీరు అందించే వరకు ధర్నాలు, రాస్తారోకోలు ఆగవని గండ్ర వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. 24 గంటల్లోగా ఆయకట్టు పంట పొలాలకు నీరు విడుదల చేయకపోతే స్థానిక ఎమ్మెల్యే గ్రామాలకు వచ్చినప్పుడు రైతులు నిలదీస్తారని హెచ్చరించారు.
ఆయకట్టు గ్రామాల ప్రజల డిమాండ్ మేరకు తక్షణమే పంట పొలాలకు నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం ద్వంద్వ విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలోని రైతుల పంటలకు అధికారికంగా నీటిని విడుదల చేస్తున్న ప్రభుత్వం భూపాలపల్లి నియోజకవర్గంలోని ఆయకట్టు పొలాలకు ఎందుకు నీరు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చలివాగు ప్రాజెక్టులోని తొమ్మిది పంపులను పూర్తిస్థాయిలో నడిపించి పంట పొలాలకు నీరు అందించాలని కోరారు. ప్రస్తుతం ఐదు లేదా ఆరు పంపులు మాత్రమే నడుస్తున్నాయని, ఒకసారి మరమ్మతులు, మరోసారి విద్యుత్ సమస్య అంటూ అధికారులు కారణాలు చెబుతున్నారని అన్నారు.
తొమ్మిది పంపులు పూర్తిస్థాయిలో పనిచేస్తే నెలకు ఆరు టీఎంసీల నీటిని పంపింగ్ చేయవచ్చని తెలిపారు. ఆరు నెలల్లో 36 టీఎంసీల నీటిని పంపింగ్ చేస్తే పంట పొలాలు ఎండిపోకుండా, తాగునీటి సమస్య లేకుండా చూడవచ్చన్నారు.
ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఒక్క రాస్తారోకోతో తమ ఆందోళన ఆగదని, ప్రభుత్వం దిగివచ్చే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. రైతులను ఏడిపించిన పాలకులు కాలగర్భంలో కలిసిపోయారని వ్యాఖ్యానించారు. ‘రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం పండదు’ అన్నారు.
ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తెచ్చిన కరువని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వర్షాల కోసం యాగాలు చేస్తే వానలు పడవని, గోదావరి, కృష్ణా నదుల్లో నీరు ప్రవహిస్తున్నా పంట పొలాలు ఎండిపోతున్నాయని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సరైన విధానాలు అవలంబించి పంపులను పూర్తిస్థాయిలో నడిపించాలని డిమాండ్ చేశారు.
జాతీయ రహదారిపై రైతులు, బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించడంతో సుమారు గంటపాటు రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.
