Hockey World Cup భారత్‌కు కఠిన సవాళ్లు.. పూర్తి షెడ్యూల్‌ ఇదే !

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : హాకీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2026 ఎఫ్‌ఐహెచ్‌ హాకీ ప్రపంచకప్‌కు రంగం సిద్ధమైంది. బెల్జియం, నెదర్లాండ్స్‌ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీ ఆగస్టు 15 నుంచి 30 వరకు జరగనుంది. పురుషుల విభాగంలో 16 జట్లు, మహిళల విభాగంలో మరో 16 జట్లు టైటిల్‌ కోసం పోటీ పడనున్నాయి. కాగా, ఈ టోర్నీలో భారత పురుషుల, మహిళల జట్లు రెండూ పూల్‌-డి‌లో చోటు దక్కించుకున్నాయి.

ఈసారి ప్రపంచకప్‌ ఫార్మాట్‌లోనూ మార్పులు చేశారు. పూల్‌ దశ తర్వాత నేరుగా క్వార్టర్‌ఫైనల్స్‌ కాకుండా రెండో దశలో ప్రత్యేక పూల్స్‌ ఏర్పాటు చేస్తారు. తొలి దశలో సాధించిన పాయింట్లకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. దీంతో ప్రారంభ మ్యాచ్‌ల నుంచే ప్రతి జట్టుపైనా ఒత్తిడి పెరగనుంది.

భారత్‌ పూల్‌-డి పురుషుల విభాగం..

భారత్‌ పురుషుల హాకీ జట్టు పూల్‌-డి‌లో చోటు దక్కించుకుంది. ఈ పూల్‌లో భారత్‌తో పాటు ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌, వేల్స్‌ జట్లు ఉన్నాయి. తొలి దశలోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడాల్సి రావడం ఈ ప్రపంచకప్‌లో ప్రత్యేక ఆకర్షణగా మారింది.

పురుషుల విభాగంలో పూల్‌-ఏలో అర్జెంటీనా, జపాన్‌, నెదర్లాండ్స్‌, న్యూజిలాండ్‌ జట్లు ఉన్నాయి. పూల్‌-బిలో బెల్జియం, ఫ్రాన్స్‌, జర్మనీ, మలేసియా జట్లు పోటీపడనున్నాయి. పూల్‌-సిలో ఆస్ట్రేలియా, స్పెయిన్‌, ఐర్లాండ్‌, దక్షిణాఫ్రికా జట్లు ఉండగా.. పూల్‌-డిలో ఇంగ్లండ్‌, భారత్‌, పాకిస్థాన్‌, వేల్స్‌ జట్లు తలపడనున్నాయి.

భారత్‌ తన ప్రపంచకప్‌ ప్రయాణాన్ని ఆగస్టు 15న వేల్స్‌తో జరిగే మ్యాచ్‌తో ప్రారంభించనుంది. అనంతరం ఆగస్టు 17న ఇంగ్లండ్‌తో, ఆగస్టు 19న పాకిస్థాన్‌తో కీలక పోరులో తలపడనుంది. ఈ మూడు మ్యాచ్‌లూ నెదర్లాండ్స్‌లోని ఆమ్స్‌టెల్‌వీన్‌ వాగెనర్‌ హాకీ స్టేడియంలో జరగనున్నాయి.

పూల్‌ దశలో మెరుగైన స్థానంలో నిలిచి తదుపరి దశకు చేరుకోవాలంటే భారత్‌కు ప్రతి మ్యాచ్‌ కీలకమే. ముఖ్యంగా తొలి మ్యాచ్‌ నుంచే విజయాలతో పాయింట్లు సాధించడం ద్వారా ముందంజ వేయాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రపంచ కప్ కు భారత పురుషుల జట్టు:

గోల్‌కీపర్లుగా మొహిత్‌ హెచ్‌.ఎస్‌, సూరజ్‌ కర్కేరా ఎంపికయ్యారు. డిఫెండర్ల విభాగంలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌తో పాటు జర్మన్‌ప్రీత్‌ సింగ్‌, అమిత్‌ రోహిదాస్‌, జుగ్‌రాజ్‌ సింగ్‌, సంజయ్‌, సుమిత్‌, యశ్‌దీప్‌ శివాచ్‌ ఉన్నారు.

మిడ్‌ఫీల్డర్లుగా రాజిందర్‌ సింగ్‌, ఆదిత్య అర్జున్‌ లాలాగే, హార్దిక్‌ సింగ్‌, మన్‌ప్రీత్‌ సింగ్‌, నీలకంఠ శర్మ, వివేక్‌ సాగర్‌ ప్రసాద్‌ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఫార్వర్డ్స్‌ విభాగంలో దిల్‌ప్రీత్‌ సింగ్‌, షిలానంద్‌ లక్రా, సుఖ్‌జీత్‌ సింగ్‌, మందీప్‌ సింగ్‌, అభిషేక్‌ ఉన్నారు.

అనుభవం, యువశక్తి కలగలిసిన ఈ జట్టుపై ప్రపంచకప్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ నాయకత్వంలో భారత డిఫెన్స్‌ ఎంత పటిష్ఠంగా నిలుస్తుందన్నది కీలకం కానుంది. అదే సమయంలో మన్‌ప్రీత్‌ సింగ్‌ వంటి సీనియర్‌ ఆటగాళ్ల అనుభవం కీలక మ్యాచ్‌ల్లో భారత్‌కు అదనపు బలంగా మారనుంది

మహిళల విభాగంలోనూ భారత్‌కు సవాల్‌

మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత జట్టుకు కూడా కఠినమైన ప్రత్యర్థులు ఎదురయ్యారు. భారత్‌ పూల్‌-డి‌లో చోటు దక్కించుకోగా.. ఈ విభాగంలో చైనా, ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా జట్లతో పోటీ పడనుంది. భారత మహిళల జట్టు తన పూల్‌ మ్యాచ్‌లన్నింటినీ నెదర్లాండ్స్‌లోని ఆమ్స్‌టెల్‌వీన్‌ వాగెనర్‌ హాకీ స్టేడియంలోనే ఆడనుంది.

మహిళల విభాగంలో పూల్‌-ఏలో ఆస్ట్రేలియా, చిలీ, జపాన్‌, నెదర్లాండ్స్‌ జట్లు ఉన్నాయి. పూల్‌-బిలో అర్జెంటీనా, జర్మనీ, స్కాట్లాండ్‌, అమెరికా జట్లు తలపడనున్నాయి. పూల్‌-సిలో బెల్జియం, స్పెయిన్‌, ఐర్లాండ్‌, న్యూజిలాండ్‌ జట్లు ఉండగా.. పూల్‌-డిలో చైనా, ఇంగ్లండ్‌, భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు పోటీ పడనున్నాయి.

భారత మహిళల జట్టు ఆగస్టు 16న చైనాతో తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఆ తర్వాత ఆగస్టు 18న దక్షిణాఫ్రికాతో, ఆగస్టు 20న ఇంగ్లండ్‌తో కీలక పోరులో తలపడుతుంది. ఈ మూడు మ్యాచ్‌లు కూడా ఆమ్స్‌టెల్‌వీన్‌లోని వాగెనర్‌ హాకీ స్టేడియంలోనే జరగనున్నాయి.

పూల్‌ దశలో మెరుగైన ప్రదర్శన కనబర్చి తదుపరి దశకు చేరుకోవాలంటే భారత మహిళల జట్టుకు ప్రతి మ్యాచ్‌ కీలకం కానుంది. బలమైన ప్రత్యర్థులు ఉన్నప్పటికీ సమష్టి ప్రదర్శనతో ముందుకు సాగాలని భారత్‌ పట్టుదలగా ఉంది.

భారత మహిళల హాకీ జట్టు ఇదే..

గోల్‌కీపర్లుగా సవిత, బిచు దేవి ఖరిబామ్‌ జట్టులో చోటు దక్కించుకున్నారు. డిఫెండర్ల విభాగంలో ఇషికా చౌదరి, సుశీల చాను పుఖ్రాంబమ్‌, లాల్తంత్లువాంగి, జ్యోతి, శిల్పి దబాస్‌ ఉన్నారు.

మిడ్‌ఫీల్డ్‌ బాధ్యతలను కెప్టెన్‌ సలీమా టెటే, నిక్కీ ప్రధాన్‌, సాక్షి రాణా, సునీలితా టోప్పో, నేహా, దీపికా సోరెంగ్‌ నిర్వహించనున్నారు. ఫార్వర్డ్‌ విభాగంలో లాల్‌రెమ్సియామి, రుతుజా దాదాసో పిసాల్‌, నవ్‌నీత్‌ కౌర్‌, దీపిక, ఇషికా, బల్జీత్‌ కౌర్‌, బ్యూటీ డుంగ్‌డుంగ్‌ ఉన్నారు.

సలీమా టెటే నాయకత్వంలో బరిలోకి దిగనున్న భారత మహిళల జట్టు, ప్రపంచకప్‌లో పతకం లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అనుభవం, యువ ఆటగాళ్ల ప్రతిభ కలయికతో ఉన్న ఈ జట్టు బలమైన ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. ఇటీవల సాధించిన విజయాలు భారత్‌కు సానుకూలంగా మారగా.. ప్రపంచకప్‌లోనూ అదే జోరును కొనసాగించాలని జట్టు పట్టుదలగా ఉంది.

టోర్నీ ఎలా సాగుతుంది?

ఈ ప్రపంచకప్‌లో మొత్తం 16 జట్లు నాలుగు పూల్స్‌గా విడిపోయాయి. ఒక్కో పూల్‌లో నాలుగు జట్లు ఉంటాయి. తొలి దశలో ప్రతి జట్టు మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. తొలి దశ అనంతరం ప్రతి పూల్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు తదుపరి దశకు చేరతాయి. అక్కడి నుంచి సెమీఫైనల్‌ బెర్త్‌ల కోసం పోటీ కొనసాగుతుంది. ప్రారంభ దశలో సాధించిన పాయింట్లు కూడా తదుపరి దశలో కీలకం కానున్నాయి. అందువల్ల ఒక మ్యాచ్‌ ఓడినా తర్వాతి దశలో దాని ప్రభావం ఉండే అవకాశం ఉంది.

భారత్‌ ముందున్న మార్గం..

పురుషుల జట్టు పూల్‌ దశలో వేల్స్‌, ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌ను ఎదుర్కొంటుంది. మహిళల జట్టు చైనా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌తో పోటీ పడుతుంది. రెండు జట్లూ తమ పూల్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిస్తే తదుపరి దశకు చేరతాయి. మహిళల ప్రపంచకప్‌లో సెమీఫైనల్స్‌ ఆగస్టు 27న, ఫైనల్‌ ఆగస్టు 29న జరగనుంది. పురుషుల సెమీఫైనల్స్‌ ఆగస్టు 28న, ఫైనల్‌ ఆగస్టు 30న నిర్వహిస్తారు. మహిళల ఫైనల్‌ ఆమ్స్‌టర్‌డామ్‌లో, పురుషుల ఫైనల్‌ బెల్జియంలోని వావ్రెలో జరగనుంది.

రెండు వేదికల్లో ప్రపంచకప్‌ సందడి…

ప్రపంచకప్‌ మ్యాచ్‌లు రెండు ప్రధాన వేదికల్లో జరుగుతాయి. నెదర్లాండ్స్‌లోని వాగెనర్‌ హాకీ స్టేడియం, ఆమ్స్‌టెల్‌వీన్‌, బెల్జియంలోని బెల్ఫియస్‌ హాకీ అరేనా, వావ్రె టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అధికారిక ఎఫ్‌ఐహెచ్‌ షెడ్యూల్‌లో ఈ రెండు వేదికలే నమోదయ్యాయి. భారత్‌కు చెందిన రెండు జట్లూ తమ పూల్‌ మ్యాచ్‌లన్నింటినీ ఆమ్స్‌టెల్‌వీన్‌లోనే ఆడటం కొంత అనుకూలంగా మారనుంది. అయితే ప్రత్యర్థుల స్థాయి దృష్ట్యా ఆరంభం నుంచే పూర్తి స్థాయి ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది.

ఆగస్టు 15న పురుషుల జట్టు వేల్స్‌తో తొలి మ్యాచ్‌ ఆడనుండగా.. ఆగస్టు 16న మహిళల జట్టు చైనాతో తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఆగస్టు 19న పురుషుల భారత్‌-పాకిస్థాన్‌ పోరు, ఆగస్టు 20న మహిళల భారత్‌-ఇంగ్లండ్‌ మ్యాచ్‌తో తొలి దశలో భారత జట్ల కీలక పోటీలు ముగుస్తాయి. ఆ తర్వాతి దశకు చేరితే పతక పోరులో అసలైన పరీక్ష మొదలవుతుంది.