రైతులకు పట్టాదారు పాస్‌బుక్‌ల పంపిణీ
ఫిరంగిపురం, ఆంధ్రప్రభ: మండలంలోని గుండాలపాడు గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్‌బుక్‌ల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ కార్యక్రమంలో పాల్గొని రైతులకు పట్టాదారు పాస్‌బుక్‌లను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు తన భూమిపై కలిగి ఉన్న హక్కుకు పట్టాదారు పాస్‌బుక్ అత్యంత కీలకమైన పత్రమని అన్నారు. రైతుల భూములకు పూర్తి భద్రత, హక్కులకు రక్షణ కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక రాజముద్రకు బదులుగా అప్పటి ముఖ్యమంత్రి జగన్ ముద్రతో పట్టాదారు పాస్‌బుక్‌లను పంపిణీ చేశారని శ్రావణ్‌కుమార్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌బుక్‌లను రైతులకు అందజేస్తున్నామని తెలిపారు.
రైతుల ప్రయోజనాలను కాపాడుతూ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు రైతన్నకు అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

