గర్భిణులకు ఉచిత 2డీ ఎకో పరీక్షలు..

చిట్టీనగర్, ఆంధ్రప్రభ : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలోని సుజనా ఫౌండేషన్‌ గర్భిణుల కోసం నిర్వహిస్తున్న ఉచిత మొబైల్‌ 2డీ ఎకో ఆరోగ్య పరీక్షల శిబిరాలకు విశేష స్పందన లభిస్తోంది. చిట్టీనగర్‌లోని సర్కిల్‌–1 కార్యాలయం వద్ద మంగళవారం నిర్వహించిన ఉచిత ఆరోగ్య పరీక్షలను స్థానిక మహిళలు సద్వినియోగం చేసుకున్నారు.

గర్భధారణ సమయంలో వచ్చే గుండె సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించి, ప్రాణాంతక పరిస్థితులను నివారించేందుకు ఈ పరీక్షలు ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన గర్భిణుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఖర్చు లేకుండా అత్యాధునిక వైద్య పరీక్షలను వారి ముంగిటకే తీసుకురావడమే సుజనా ఫౌండేషన్‌ లక్ష్యమని పేర్కొన్నారు.

మధ్యాహ్నం వరకు కొనసాగిన శిబిరంలో 28 మంది గర్భిణులకు 2డీ ఎకో మేటర్నల్‌ కార్డియాక్‌ రిస్క్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. డాక్టర్‌ సుధారాణి, 2డీ ఎకో టెక్నీషియన్‌ షారోన్‌ గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్య పరిరక్షణపై పలు సూచనలు చేశారు.

శిబిరంలో ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, యూపీహెచ్‌సీ సిబ్బంది, సుజనా ఫౌండేషన్‌ సిబ్బంది, సుజనా మిత్రా సమన్వయకర్తలు సేవలందించారు. కూటమి నేతలు వేంపలి గౌరీశంకర్‌, నాగోతి రామారావు, ఆకారపు విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.