ప్రమాదంలో గాయపడిన ఉపాధ్యాయుడికి తోటి ఉపాధ్యాయుల ఆపన్నహస్తం

టేకుమట్ల, ఆంధ్రప్రభ: ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న తోటి ఉపాధ్యాయుడికి టేకుమట్ల మండల ఉపాధ్యాయులు మానవతా దృక్పథంతో అండగా నిలిచారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌ మండల కేంద్రానికి చెందిన రాము గత వారం గుడేపాడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.

ఈ విషయం తెలుసుకున్న గర్మిళ్లపల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు మోయిన్‌ చొరవ తీసుకుని టేకుమట్ల మండలంలోని ఉపాధ్యాయుల నుంచి విరాళాలు సేకరించారు. ఉపాధ్యాయులు తమ వంతు సహకారం అందించడంతో మొత్తం రూ.32,500 సమకూరింది. ఈ మొత్తాన్ని సోమవారం ఎంఈఓ సుధాకర్‌ చేతుల మీదుగా గర్మిళ్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న రాముకు అందజేశారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. కష్టకాలంలో తోటి ఉపాధ్యాయుడికి అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయుల ఐక్యత, మానవతా విలువలకు ఈ సహాయం నిదర్శనమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో వెలిశాల కాంప్లెక్స్‌ హెచ్‌ఎం ప్రసాద్‌, గర్మిళ్లపల్లి హెచ్‌ఎం రాము, వెంకట్రావుపల్లి హెచ్‌ఎం రమేష్‌, మేదరమెట్ల హెచ్‌ఎం శ్రీనివాస్‌, గర్మిళ్లపల్లి హెచ్‌ఎం నవత, ఉపాధ్యాయులు స్వామి, మోయిన్‌ తదితరులు పాల్గొన్నారు.