అమ్మవారికి సమర్పించిన మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్, ఆంధ్రప్రభ: సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో ఆషాఢ బోనాల వేడుకలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి మారు బోనం సమర్పించారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను రాష్ట్ర ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారని మంత్రి అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించినట్లు తెలిపారు.

ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల ఉత్సవాలకు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఆలయ పరిసరాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
