ఉట్నూర్‌లో ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా

జాతీయతను పెంపొందించడమే ప్రధాన ధ్యేయం

పార్టీలకు, కులమతాలకు అతీతంగా పాల్గొనాలి: బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీష్‌ రాథోడ్‌

ఉట్నూర్, ఆంధ్రప్రభ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనల మేరకు ఈ నెల 12న బుధవారం ఉదయం 9.30 గంటలకు ఉట్నూర్‌ మండల కేంద్రంలో హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీష్‌ రాథోడ్‌ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాయకులతో కలిసి జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశభక్తి, జాతీయతా భావాన్ని పెంపొందించడమే హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. పార్టీలకు, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం ఉట్నూర్‌లోని వినాయక చౌక్‌ నుంచి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చౌక్‌ వరకు కొనసాగుతుందని రితీష్‌ రాథోడ్‌ తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా పాల్గొనాలని కోరారు.