ప్రజల వద్దకే ప్రభుత్వం.. ప్రతి ఇంటి వద్దకే తెలుగుదేశం
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందేలా కృషి: డాక్టర్ పనబాక లక్ష్మి
తిరుపతి, ఆంధ్రప్రభ: ప్రజా సంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు, టీటీడీ బోర్డు సభ్యురాలు డాక్టర్ పనబాక లక్ష్మి అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆమె సూచించారు.
తిరుపతి నియోజకవర్గ పరిధిలోని క్లస్టర్-1, 2వ వార్డులో మంగళవారం క్లస్టర్ ఇన్‌చార్జ్ ఎం. కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పనబాక లక్ష్మి హాజరై, తిరుపతి నియోజకవర్గ ఇన్‌చార్జ్ జేబీ శ్రీనివాస్‌తో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ పనబాక లక్ష్మి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రజా సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సూపర్-6 హామీల అమలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నామని చెప్పారు.
“ప్రజల వద్దకే ప్రభుత్వం.. ప్రతి ఇంటి వద్దకే తెలుగుదేశం” అనే లక్ష్యంతో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు. ప్రజల నుంచి నేరుగా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా నాయకులు, కార్యకర్తలు బాధ్యతతో పనిచేయాలని సూచించారు.
ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో వివరించడం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింహ యాదవ్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, తిరుపతి పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ యశ్వంత్ రెడ్డి, పార్లమెంట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ ముని రామయ్య, యూనిట్ ఇన్‌చార్జ్ ఎం. రామ యాదవ్‌తో పాటు క్లస్టర్, వార్డు నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
