ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త..

  • యువతకు, మహిళలకు సువర్ణావకాశం

నరసరావుపేట, ఆంధ్రప్రభ : ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పల్నాడు జిల్లాలో పరిశ్రమలు, సర్వీస్‌ యూనిట్ల స్థాపనపై ఆసక్తి ఉన్న ఔత్సాహికులకు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా పరిశ్రమల అధికారి తెలిపారు.

ప్రస్తుత సంవత్సరంలో వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా పరిశ్రమలు లేదా సర్వీస్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలనుకునే ఔత్సాహికులతో పాటు, గతంలో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొంది మొదటి తరం పారిశ్రామికవేత్తలుగా యూనిట్లు ప్రారంభించిన వారికి కూడా ఈ శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. వ్యాపారాలను ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా విజయవంతంగా కొనసాగించేందుకు అవసరమైన శిక్షణ, సలహాలు, సహాయ సహకారాలు అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

సుమారు 21 రోజుల పాటు నియోజకవర్గ స్థాయిలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కనీసం పదో తరగతి లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగిన నిరుద్యోగ యువత, ఏదైనా వృత్తిలో నైపుణ్యం లేదా అనుభవం కలిగి, ఆ అనుభవాన్ని ఉపయోగించుకుని పరిశ్రమ లేదా సర్వీస్‌ యూనిట్‌ ప్రారంభించాలనుకునే వారు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని తెలిపారు.

కొంత పెట్టుబడి సామర్థ్యం కలిగి ఏ పరిశ్రమను ప్రారంభిస్తే మంచి ఆదాయం పొందవచ్చో ఆలోచిస్తున్న వారికి, ముఖ్యంగా ఇంటి వద్ద తక్కువ పెట్టుబడితో సూక్ష్మ పరిశ్రమలు స్థాపించి నిర్వహించాలనుకునే మహిళా ఔత్సాహికులకు ఈ శిక్షణ మంచి అవకాశమని పేర్కొన్నారు.

ఈ శిక్షణలో పరిశ్రమల ఎంపిక, నూతన తరహా పరిశ్రమలపై అవగాహన, పరిశ్రమ స్థాపనకు అవసరమైన అనుమతులు, వాటిని పొందే విధానం, ప్రభుత్వ పథకాల ద్వారా పెట్టుబడి, రుణ సదుపాయాలు పొందే విధానం, ప్రభుత్వం అందించే రాయితీలు, పరిశ్రమ నిర్వహణకు సంబంధించిన సూచనలు, సలహాలపై సమగ్ర అవగాహన కల్పించనున్నారు.

అలాగే ప్రాజెక్టు నివేదిక తయారీ, పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకుల సమీకరణ, యంత్రసామగ్రి కొనుగోలు విధానం, తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సదుపాయాలు కల్పించుకునే మార్గాలపై కూడా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

శిక్షణ అనంతరం అర్హులైన లబ్ధిదారులకు బ్యాంకు అనుసంధానం కల్పించి, ప్రాజెక్టులకు అవసరమైన రుణ సహాయం పొందేలా పరిశ్రమల శాఖ ద్వారా పూర్తి సహకారం అందిస్తామని జిల్లా పరిశ్రమల అధికారి తెలిపారు. పరిశ్రమ స్థాపనలోని వివిధ దశల్లో అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తామని పేర్కొన్నారు.

అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఏపీఐఐసీ, ఎంఎస్‌ఎంఈ పార్కుల్లో రాయితీ ధరలపై పరిశ్రమల స్థాపనకు అవసరమైన స్థలాలను కూడా అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

పరిశ్రమల స్థాపనపై ఆసక్తి ఉన్న యువత, మహిళలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిశ్రమల అధికారి కోరారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ పేరు, చిరునామా, సెల్‌ఫోన్‌ నంబర్‌, విద్యార్హత తదితర వివరాలతో కూడిన బయోడేటాను జిల్లా పరిశ్రమల అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.