ఘనంగా ‘సంధల్’ వేడుకలు
భక్తులతో కిక్కిరిసిన కాజీపేట దర్గా..
కాజీపేట, ఆంధ్రప్రభ: కాజీపేట పట్టణంలోని హజరత్ సయ్యద్ షా అఫ్టల్ బియాబానీ దర్గాలో ఉత్సవాల్లో భాగంగా ‘సంధల్’ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులతో దర్గా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. డప్పు చప్పుళ్లు, ఫకీర్ల విన్యాసాలు, ఖవ్వాలీ, భజన కీర్తనలు, డీజే పాటలు, యువకుల నృత్యాలు, కేరింతలతో దర్గా పరిసర ప్రాంతం మారుమ్రోగింది.
దర్గా పీఠాధిపతి కుసురు పాషా ఆధ్వర్యంలో పలు దర్గాల పీఠాధిపతులు బడేఘార్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి కుసురు పాషా గంధం ఉన్న వెండి గిన్నెను తలపై పెట్టుకుని దర్గా వైపు ఊరేగింపుగా బయలుదేరారు. ఈ సందర్భంగా గంధం గిన్నెను తాకేందుకు భక్తులు పోటీపడ్డారు.
అర్ధరాత్రి వేళ దర్గాకు చేరుకున్న పీఠాధిపతి సయ్యద్ షా అఫ్టల్ బియాబానీ సమాధిని గులాబీ నీటితో కడిగి, గంధలేపనం చేశారు. అనంతరం పూల ఛాదర్ కప్పి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దీంతో బియాబానీ దర్గా ఉత్సవాలు ప్రారంభమైనట్లు ప్రకటించారు.
దేశ, విదేశాల నుంచి తరలివచ్చిన పీఠాధిపతులు, మతపెద్దలు, సూఫీలు, భక్తులు ఖవ్వాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నగర సీపీ శ్వేత ఆదేశాల మేరకు, కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి పర్యవేక్షణలో స్థానిక ఇన్‌స్పెక్టర్ శ్యాంసుందర్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్గా పీఠాధిపతి కుసురు పాషా అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో భక్తులు స్వేచ్ఛగా దర్గాను సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు.
