బాల్కొండ కాంగ్రెస్‌లో వర్గపోరు.. కార్యకర్తల్లో అయోమయం

నాయకుల ఆధిపత్య పోరుతో కేడర్‌ ఇబ్బందులు..

భీంగల్‌లో బహిర్గతమవుతున్న విభేదాలు

భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ: బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్‌లో నాయకుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు క్రమంగా కిందిస్థాయి కార్యకర్తలపై ప్రభావం చూపుతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఒకే పార్టీలో పలువురు ముఖ్య నాయకులు తమ తమ వర్గాలను బలోపేతం చేసుకునే ప్రయత్నాలు చేస్తుండటంతో కార్యకర్తలు ఏ కార్యక్రమానికి హాజరు కావాలి, ఎవరికి మద్దతుగా నిలవాలి అనే విషయంలో అయోమయానికి గురవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా ముత్యాల సునీల్‌కుమార్‌ కొనసాగుతుండగా, ఇదే ప్రాంతానికి చెందిన రాష్ట్రస్థాయి నాయకులు ఈరవత్రి అనిల్‌, మానాల మోహన్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్‌ గౌడ్‌ వంటి నేతల రాజకీయ కార్యకలాపాలు కూడా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా భీంగల్‌లో వేర్వేరుగా సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించడం, నాయకుల పుట్టినరోజు వేడుకలను విడివిడిగా జరుపుకోవడం పార్టీలోని విభేదాలను బయటపెడుతోందనే చర్చ జరుగుతోంది.

కార్యకర్తలు రెండు వర్గాల మధ్య నలిగిపోతున్నారని, ఏ వర్గం కార్యక్రమానికి వెళ్లినా మరో వర్గం నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా కొనసాగుతున్న ఈ పరిస్థితి పార్టీ ఐక్యతపై ప్రభావం చూపుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాయకుల మధ్య సమన్వయం లేకపోతే బలమైన కేడర్‌ ఉన్నప్పటికీ దాని ప్రయోజనం పార్టీకి పూర్తిస్థాయిలో దక్కదనే చర్చ జరుగుతోంది.