స్టైపెండ్ పెంపుపై జూనియర్ డాక్టర్ల ఆందోళన..
- రాతపూర్వక హామీ ఇవ్వకపోవడంతో నిరసనలు.. 17 నుంచి సమ్మె ఉధృతం
విజయవాడ, ఆంధ్రప్రభ : స్టైపెండ్ పెంపుపై ప్రభుత్వం నుంచి రాతపూర్వక హామీ రాకపోవడంతో ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (ఏపీ జూడా) ఆందోళన బాట పట్టింది. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధన ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఇంటర్న్లు, పీజీ వైద్యులు, సీనియర్ రెసిడెంట్లు సోమవారం నుంచి దశలవారీ నిరసనలు చేపట్టనున్నారు.
ఆందోళనలో భాగంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నాన్-ఎమర్జెన్సీ వైద్య సేవలను నిలిపివేయనున్నట్లు ఏపీ జూడా ప్రకటించింది. అయితే రోగుల అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అత్యవసర సేవలు, ఐసీయూ సేవలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.
ఆగస్టు 12 నుంచి 15వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిరసనలు కొనసాగిస్తామని జూడా తెలిపింది. స్టైపెండ్ సవరణపై ప్రభుత్వం వెంటనే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ఆగస్టు 15 సాయంత్రం 5 గంటల్లోగా స్టైపెండ్ సవరణ అమలుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వు లేదా జారీ చేసే కాలపట్టికపై స్పష్టమైన లిఖితపూర్వక హామీ ఇవ్వాలని ఏపీ జూడా గడువు విధించింది.
గడువులోగా ప్రభుత్వం నుంచి సంతృప్తికరమైన స్పందన రాకపోతే ఆగస్టు 17 నుంచి ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించింది. తదుపరి దశ ఉద్యమ కార్యాచరణను 17వ తేదీలోపు ప్రకటిస్తామని వెల్లడించింది.
ఇదే సమయంలో సమ్మె కాలంలో డీఆర్పీ, పెరిఫెరల్ పోస్టింగ్స్‌ను కూడా నిలిపివేస్తున్నట్లు ఏపీ జూడా తెలిపింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న స్టైపెండ్ సవరణ అంశాన్ని ప్రభుత్వం చర్చల ద్వారా పరిష్కరించాలని కోరింది.
ప్రభుత్వం ఆగస్టు 15లోపు అర్థవంతమైన చర్చలకు ముందుకు వస్తే సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని జూనియర్ డాక్టర్లు తెలిపారు. అయితే స్పష్టమైన హామీ ఇవ్వకపోతే 17వ తేదీ నుంచి ఉద్యమాన్ని తదుపరి దశకు తీసుకెళ్లక తప్పదని తేల్చిచెప్పారు.

