40 ఏళ్ల మావోయిస్టు జీవితం… జనజీవన స్రవంతిలోకి!

  • భారీగా తగ్గిన‌ తెలంగాణకు చెందిన మావోయిస్టు కేడర్ల సంఖ్య
  • 2023లో 125 మంది.. 2026 నాటికి ముగ్గురే

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణకు చెందిన సీపీఐ మావోయిస్టు కేడర్ల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2023లో తెలంగాణకు చెందిన వివిధ స్థాయిల్లో మొత్తం 125 మంది కేడర్లు ఉండగా.. 2024లో ఆ సంఖ్య 99కు, 2025లో 55కు తగ్గింది. 2026 నాటికి తెలంగాణకు చెందిన కేవలం ముగ్గురు క్రియాశీల భూగర్భ కేడర్లు మాత్రమే మిగిలినట్లు ప్రభుత్వం పేర్కొంది. అంటే 2023తో పోలిస్తే నాలుగేళ్లలో కేడర్ల సంఖ్య 122 మంది తగ్గింది.

2023లో కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, ప్రాంతీయ కమిటీ సభ్యులు, డివిజనల్‌ కమిటీ సభ్యులు, ఏరియా కమిటీ సభ్యులు, ప్లాటూన్‌ సభ్యులు తదితర హోదాల్లో తెలంగాణకు చెందిన 125 మంది మావోయిస్టులు వివిధ దళాల్లో ఉన్నట్లు గణాంకాలు చూపిస్తున్నాయి. 2024లో ఈ సంఖ్య 99కు పడిపోయింది. 2025లో 55కు తగ్గగా.. 2026లో ముగ్గురికి చేరింది.

ప్రస్తుతం మిగిలిన ఈ ముగ్గురు కూడా తెలంగాణలో కాకుండా రాష్ట్రం వెలుపల సీపీఐ మావోయిస్టు వివిధ దళాల్లో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వారిలో ఒకరు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న ముప్పాల లక్ష్మణరావు అలియాస్‌ గణపతి కాగా.. మరో ఇద్దరు జడే రత్నాబాయి అలియాస్‌ సుజాత, వర్త శేఖర్‌ అలియాస్‌ మాంగ్తుగా పేర్కొంది. కాగా, 2023 నుంచి 2026 నాటికి గణాంకాలను పరిశీలిస్తే తెలంగాణకు చెందిన మావోయిస్టు కేడర్ల సంఖ్య 122 మంది తగ్గినట్లు స్పష్టమవుతోంది.

నాలుగు దశాబ్దాల తర్వాత జనజీవన స్రవంతిలోకి..

ఇదే సమయంలో సీపీఐ మావోయిస్టు పార్టీలో దాదాపు నాలుగు దశాబ్దాల పాటు అండర్‌గ్రౌండ్‌లో పనిచేసిన సీనియర్‌ నాయకురాలు కాకర్ల సమత అలియాస్‌ మాధవి, షకీలా, దుర్గా తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆమె లొంగుబాటు నేపథ్యంలో ములుగు జిల్లా కేంద్రంలోని పోలీసు కాన్ఫరెన్స్‌ కార్యాలయంలో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌, ములుగు జిల్లా ఎస్పీ సుదీర్‌ రామ్నాథ్‌ కేకన్‌ కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

లొంగిపోయిన మావోయిస్టులు తిరిగి సాధారణ జీవనంలో స్థిరపడేలా ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు.

ములుగు జిల్లా కేంద్రంలోని పోలీసు కాన్ఫరెన్స్‌ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సుదీర్‌ రామ్నాథ్‌ కేకన్‌తో కలిసి డీజీపీ సీవీ ఆనంద్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకర్ల సమత మావోయిస్టు ఉద్యమంలో కొనసాగిన ప్రస్థానం, ఆమె నిర్వహించిన బాధ్యతలు, ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస కార్యక్రమాల వివరాలను వెల్లడించారు.

1985లో అండర్‌గ్రౌండ్‌లోకి..

కాకర్ల సమత 1985లో వైజాగ్‌ ప్రాంతంలో నక్సలైట్‌ కార్యకలాపాలతో ప్రభావితమై అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లినట్లు డీజీపీ తెలిపారు. అప్పటి నుంచి సుమారు 40 ఏళ్ల పాటు వివిధ ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీకి పనిచేశారని చెప్పారు. హైదరాబాద్‌ కమిటీ సభ్యురాలిగా సుమారు పదేళ్లు, నల్లమల అడవుల్లో నాలుగేళ్లు, ఉత్తరప్రదేశ్‌ ఏరియా కమిటీలో రెండేళ్లు, గుజరాత్‌లోని గోల్డెన్‌ కారిడార్‌ కమిటీలో రెండేళ్లు, మహారాష్ట్ర ఏరియా కమిటీలో ఐదేళ్లు, కర్ణాటక–మహారాష్ట్ర ఉమ్మడి కమిటీలో పదేళ్ల పాటు పనిచేసినట్లు వివరించారు.

సమత 1985లో వైజాగ్‌ ప్రాంతంలో నక్సలైట్‌ కార్యకలాపాలతో ప్రభావితమై అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లినట్లు డీజీపీ తెలిపారు. అప్పటి నుంచి సుమారు 40 ఏళ్ల పాటు వివిధ ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీకి పనిచేశారని చెప్పారు. హైదరాబాద్‌లోని కమిటీ సభ్యురాలిగా సుమారు పదేళ్లు, నల్లమల అడవుల్లో నాలుగేళ్లు, ఉత్తరప్రదేశ్‌లోని ఏరియా కమిటీలో రెండేళ్లు, గుజరాత్‌లోని గోల్డెన్‌ కారిడార్‌ కమిటీలో రెండేళ్లు, మహారాష్ట్ర ఏరియా కమిటీలో ఐదేళ్లు, కర్ణాటక–మహారాష్ట్ర ఉమ్మడి కమిటీలో పదేళ్ల పాటు ఆమె పనిచేసినట్లు వివరించారు.

సిద్ధాంతపరమైన బాధ్యతల్లోనూ కీలక పాత్ర..

సమత కేవలం సాయుధ కార్యకలాపాలకే పరిమితం కాలేదని డీజీపీ తెలిపారు. మావోయిస్టు పార్టీలో సిద్ధాంతపరమైన, పత్రాల రూపకల్పనకు సంబంధించిన బాధ్యతలు కూడా నిర్వహించారని చెప్పారు. కేంద్ర కమిటీ తీర్మానాలు, పార్టీకి సంబంధించిన వివిధ పత్రాల తయారీ, సిద్ధాంతపరమైన అంశాల రూపకల్పన, అనువాదాలు, మహిళా సమస్యలపై వ్యాసాలు రాయడం, పార్టీ కేడర్‌కు అవగాహన కల్పించడం వంటి బాధ్యతల్లో ఆమె పనిచేసినట్లు వెల్లడించారు. మావోయిస్టు పార్టీ ప్రస్తుత జనరల్‌ సెక్రటరీగా ఉన్న ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతికి సీసీ స్టాఫ్‌ మెంబర్‌గా కూడా పనిచేసినట్లు సమత వెల్లడించారని డీజీపీ తెలిపారు.

కుటుంబంలోనూ మావోయిస్టు నేపథ్యం..

సమత కుటుంబం కూడా మావోయిస్టు భావజాల ప్రభావానికి లోనైనట్లు డీజీపీ తెలిపారు. ఆమె సోదరి కాకర్ల సునీత అలియాస్‌ బద్రి కూడా సీనియర్‌ మావోయిస్టు నాయకురాలిగా పనిచేశారని, గత ఏడాది తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారని చెప్పారు. మరో కజిన్‌ సోదరి కాకర్ల పద్మ కూడా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో సుదీర్ఘకాలం మావోయిస్టు కార్యకలాపాల్లో పనిచేసినట్లు తెలిపారు. 2018లో అరెస్టయిన ఆమె ప్రస్తుతం బెయిల్‌పై చెన్నైలో నివసిస్తున్నట్లు వెల్లడించారు.

సమత భర్త పటేల్‌ సుధాకర్‌రెడ్డి కూడా మావోయిస్టు పార్టీలో సీనియర్‌ కేడర్‌గా పనిచేశారని డీజీపీ చెప్పారు. మిలిటరీ కమిషన్‌తో పాటు పార్టీ ఇంటెలిజెన్స్‌ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించినట్లు తెలిపారు. 2010లో జరిగిన ఎదురుకాల్పుల్లో సుధాకర్‌రెడ్డి మృతి చెందినట్లు వెల్లడించారు.

లొంగిన మావోయిస్టులకు పునరావాసం..

మావోయిస్టులు లొంగిపోయి సాధారణ జీవితం గడిపేందుకు తెలంగాణ ప్రభుత్వం పునరావాస విధానాన్ని అమలు చేస్తోందని డీజీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు సమాజంలో తిరిగి స్థిరపడేందుకు అవసరమైన సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు లొంగిపోయిన మావోయిస్టులకు ఉచిత వైద్య చికిత్స అందించేందుకు ఆరోగ్య రక్షణ కార్డులు జారీ చేసి పంపిణీ చేసినట్లు తెలిపారు. ఆరోగ్య సమస్యలు ఎదురైతే సంబంధిత పోలీసు అధికారులను సంప్రదించవచ్చని సూచించారు.

సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు అవసరమైన ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని డీజీపీ స్పష్టం చేశారు. ఏదైనా వృత్తి లేదా వ్యాపారం చేయాలనే ఆసక్తి ఉన్న వారికి అవసరమైన శిక్షణ ఇప్పించడంతో పాటు రుణాలు అందించి స్వయం ఉపాధి పొందేలా సహకరిస్తామని చెప్పారు.

లొంగిపోయిన మావోయిస్టులకు కేసులకు సంబంధించిన సమస్యలు ఉన్నా, ఇతర ఇబ్బందులు ఎదురైనా పోలీసు అధికారులను సంప్రదించాలని సూచించారు. వారు తిరిగి పాత పరిస్థితుల్లోకి వెళ్లకుండా కుటుంబాలతో కలిసి సాధారణ జీవితం గడిపేలా చేయడమే పునరావాస విధానం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

23 మందికి రూ.2 కోట్ల వరకు సాయం

పునరావాస విధానం కింద ఇప్పటికే 23 మంది లొంగిపోయిన మావోయిస్టులకు దాదాపు రూ.2 కోట్ల వరకు ఆర్థిక సహాయం అందించినట్లు డీజీపీ తెలిపారు. పార్టీ స్థాయితో సంబంధం లేకుండా కేంద్ర కమిటీ సభ్యుడు, రాష్ట్ర కమిటీ సభ్యుడు, పార్టీ సభ్యుడు లేదా ఇతర కేడర్‌ ఎవరైనా లొంగిపోతే.. సాధారణ జీవితంలో స్థిరపడేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని స్పష్టం చేశారు. ఆర్థిక సాయంతో పాటు వైద్య సదుపాయాలు, ఉపాధి శిక్షణ, స్వయం ఉపాధి కోసం రుణాలు వంటి సహకారం అందిస్తున్నట్లు తెలిపారు.

గణపతితో పాటు సీనియర్‌ నేతలకు పిలుపు

తెలంగాణకు చెందిన మిగిలిన ముగ్గురు క్రియాశీల భూగర్భ కేడర్లు కూడా సాయుధ పోరాటాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి తరఫున విజ్ఞప్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

మావోయిస్టు పార్టీ ప్రస్తుత జనరల్‌ సెక్రటరీ ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతితో పాటు ఆయన భార్య కూడా లొంగిపోవాలని తెలంగాణ పోలీసులు మరోసారి విజ్ఞప్తి చేశారు. అండర్‌గ్రౌండ్‌లో ఉన్న సీనియర్‌ నాయకత్వం హింసా మార్గాన్ని విడిచిపెట్టి సాధారణ జీవితంలోకి రావాలని డీజీపీ సీవీ ఆనంద్‌ కోరారు. ప్రభుత్వం పునరావాసం, ఉపాధి, వైద్య సహాయం వంటి చర్యల ద్వారా లొంగిపోయిన వారిని తిరిగి సాధారణ జీవనంలోకి తీసుకురావడంపై దృష్టి సారించినట్లు అధికారులు చెబుతున్నారు.