డ్యూటీకి డుమ్మా.. వైసీపీ ర్యాలీలో వీఆర్వో హల్‌చల్‌

  • నందికొట్కూరులో ఉద్యోగి తీరుపై విమర్శలు..
  • చర్యలకు ఆర్డీవో హామీ

నందికొట్కూరు, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఉద్యోగి నిబంధనలు ఉల్లంఘించారంటూ నందికొట్కూరులో ఓ వీఆర్వోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలకు సేవలు అందించాల్సిన సమయంలో విధులకు దూరంగా ఉండి రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్నారని ఆరోపణలు వస్తున్నాయి. డీఎస్సీ అవకతవకలను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ర్యాలీలో నందికొట్కూరు మండలం మల్యాల గ్రామానికి చెందిన వీఆర్వో మనోహర్‌ పాల్గొన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. విధి నిర్వహణ సమయంలో రాజకీయ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం సర్వీస్‌ నిబంధనలకు విరుద్ధమని, వెంటనే ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పనిచేయాల్సిన ఉద్యోగులు రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ విషయంపై ఆత్మకూరు ఆర్డీవో సి. వెంకట శివను వివరణ కోరగా.. ఘటనపై విచారణ చేపట్టి, ఎవరినీ ఉపేక్షించకుండా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.