స్వర్ణ గ్రామ సచివాలయంలో అధికారుల ఆకస్మిక తనిఖీ

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: మండలంలోని షేక్‌షాన్‌పల్లిలోని స్వర్ణ గ్రామ సచివాలయాన్ని ఎంపీడీవో రవి ప్రసాద్, తహసీల్దార్ అరుణ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది విధులకు సక్రమంగా హాజరు కావడం లేదని, ప్రజలకు సకాలంలో సేవలు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తుల నుంచి ఫిర్యాదులు అందడంతో అధికారులు తనిఖీ చేపట్టారు.

ఈ సందర్భంగా సచివాలయంలోని రికార్డులను అధికారులు పరిశీలించారు. సిబ్బంది అందుబాటులో లేకపోవడంపై ఎంపీడీవో రవి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజరు పుస్తకంలో సక్రమంగా సంతకాలు చేయకుండా ఖాళీగా ఉంచడం, తమకు నచ్చిన సమయంలో వచ్చి సంతకాలు చేయడంపై మండిపడ్డారు. విధులకు గైర్హాజరవుతున్న సిబ్బంది వేతనాలను పెండింగ్‌లో ఉంచాలని ఆదేశించారు.

విధులకు గైర్హాజరయ్యే సిబ్బందిపై చర్యలు తప్పవని ఎంపీడీవో రవి ప్రసాద్ హెచ్చరించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని, విధుల్లో సమయపాలన ఖచ్చితంగా పాటించాలని సిబ్బందికి సూచించారు.

ఓటర్లకు తహసీల్దార్ నోటీసులు

అనంతరం షేక్‌షాన్‌పల్లిలో ఎస్‌ఐఆర్ ప్రక్రియలో మ్యాపింగ్ కాని ఓటర్లు, ఓటర్ల వివరాల్లో తేడాలు ఉన్న వారికి తహసీల్దార్ అరుణ నోటీసులు అందజేశారు. ఓటర్ల వివరాలను పరిశీలించి అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.