కనకదుర్గమ్మకు పెనమలూరు భక్తుల ఆషాఢ సారె
- వెలగపూడి శంకర్‌బాబు ఆధ్వర్యంలో ఘనంగా సమర్పణ..
- మహామండపం ఆరో అంతస్తులో అమ్మవారికి పవిత్ర సారె సమర్పించిన భక్తులు
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో అమ్మవారికి పెనమలూరు నియోజకవర్గానికి చెందిన భక్తులు సోమవారం భక్తిశ్రద్ధలతో ఆషాఢ సారె సమర్పించారు. ఆలయ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుడు వెలగపూడి శంకర్‌బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మహామండపంలోని ఆరో అంతస్తుకు చేరుకున్న భక్తులు కనకదుర్గమ్మకు పవిత్ర సారెను సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. కార్యక్రమంలో పాలకమండలి సభ్యురాలు సరిత సాయి, పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. అమ్మవారి నామస్మరణతో ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

