ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులకు గడువు పొడిగింపు
- ఈ నెల 15 వరకు అవకాశం..
- వరుస సెలవుల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ నగర పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకునే గడువును తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 15వ తేదీ వరకు అవకాశం కల్పించింది. వరుస సెలవుల కారణంగా పలువురు దరఖాస్తు చేసుకోలేకపోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇండ్లు లేని పేదలకు సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో హైదరాబాద్ నగరంలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. క్యూర్ పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 7,340 ఇళ్లను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ ఇళ్ల కోసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.
ఇప్పటికే పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన అనంతరం అధికారులు వాటిని పరిశీలించనున్నారు. అర్హతలు, నిబంధనల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు.
దరఖాస్తు చేసుకున్న వారు తమ దరఖాస్తు సంఖ్య, రసీదు, చెల్లింపు వివరాలను భద్రంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దరఖాస్తులో నమోదు చేసిన వివరాలు సరిగ్గా ఉన్నాయా? చెల్లింపు పూర్తయిందా? వంటి అంశాలను పరిశీలించుకోవాలని తెలిపారు.
అర్హతల పరిశీలన అనంతరం అనర్హుల దరఖాస్తులను తొలగించి, లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఎంపిక ప్రక్రియలో ఇల్లు కేటాయించని వారికి వారు చెల్లించిన రూ.10 వేల డిపాజిట్ తిరిగి చెల్లించనున్నట్లు అధికారులు తెలిపారు. లాటరీలో ఎంపికైన వారికి రూ.6 లక్షలకే ఫ్లాట్ కేటాయించనున్నారు.
తొలి దశలో హైదరాబాద్‌లోని 16 నియోజకవర్గాల్లో నిర్మించనున్న ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఫ్లాట్ల విస్తీర్ణం సుమారు 525 చదరపు అడుగులు ఉండనుంది. ఒక్కో ఫ్లాట్ నిర్మాణ వ్యయం రూ.11 లక్షలు కాగా, ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ భరిస్తుంది. మిగిలిన రూ.6 లక్షలను లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది.
అయితే దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఇల్లు ఖరారైనట్లు కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన అర్హత ప్రమాణాల ప్రకారం పరిశీలన అనంతరం మాత్రమే లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలిపారు.
