తోట్లవల్లూరు–బద్రీరాజుపాలెం చిన్న కట్ట రోడ్డు అభివృద్ధికి శ్రీకారం
- రూ.లక్షల వ్యయంతో రహదారి అభివృద్ధి..
- గ్రామాల మధ్య రాకపోకలకు మరింత సౌకర్యం
తోట్లవల్లూరు, ఆంధ్రప్రభ: తోట్లవల్లూరు నుంచి బద్రీరాజుపాలెం వెళ్లే సుమారు రెండు కిలోమీటర్ల చిన్న కట్ట రోడ్డు అభివృద్ధి పనులకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి సోమవారం కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు.
ప్రజల రాకపోకలకు ఎంతో కీలకమైన ఈ రహదారిని మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగా రోడ్డుకు ఇరువైపులా పెరిగిన చెట్లు, పిచ్చి మొక్కలను తొలగించి వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రహదారిని అభివృద్ధి చేయనున్నారు.
పనులు పూర్తయితే తోట్లవల్లూరు, బద్రీరాజుపాలెం గ్రామాలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల రవాణా అవసరాలను తీర్చేందుకు ఈ రహదారి అభివృద్ధి ఉపయోగపడుతుందని స్థానికులు తెలిపారు.
ఈ రహదారి అభివృద్ధి పనులకు రామినేని కుటుంబయ్య అందించిన సహకారం అభినందనీయమని వీరంకి వెంకట గురుమూర్తి అన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి అందరి సహకారంతో కృషి చేస్తామని తెలిపారు.
రహదారులు, ఇతర మౌలిక వసతులను మెరుగుపరచడం ద్వారా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
