సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

తాడ్వాయి, ఆంధ్రప్రభ: సైబర్‌ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు సూచించారు. సోమవారం చిట్యాల గ్రామంలో నిర్వహించిన కమ్యూనిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

యువత డ్రగ్స్‌, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఉన్నత విద్యను అభ్యసించి మంచి భవిష్యత్తును ఎంచుకోవాలని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌ చేసినప్పుడు ఓటీపీ వివరాలు చెప్పవద్దని, వాట్సాప్‌లో గుర్తుతెలియని వ్యక్తులు పంపించే లింకులను తెరవవద్దని హెచ్చరించారు.

గుర్తుతెలియని వ్యక్తులు గ్రామంలో సంచరిస్తున్నా, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. గ్రామంలోని ప్రతి వీధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఇందుకు ప్రజాప్రతినిధులు సహకరించాలని సూచించారు.

తాడ్వాయి మండలంలో నేరాల నియంత్రణలో పురోగతి కనిపిస్తోందని డీఎస్పీ తెలిపారు. నేరాల నియంత్రణకు ప్రజల సహకారం ఎల్లప్పుడూ అవసరమని పేర్కొన్నారు. ప్రస్తుతం విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్లను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో తాడ్వాయి ఎస్సై నరేష్‌, గ్రామ సర్పంచ్‌ రంజిత్‌రెడ్డి, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు అంబీర్‌ మనోహర్‌రావు, విలేజ్‌ పోలీస్‌ ఆఫీసర్‌ యాదగిరి, పోలీసు సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ప్రజలు, డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు.