రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు
ఉంగుటూరు, ఆంధ్రప్రభ: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం ఆత్కూరులో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్కూరుకు చెందిన ముత్యాల వెంకటకృష్ణ సోమవారం ఉదయం తన ద్విచక్ర వాహనంపై గన్నవరం నుంచి ఆత్కూరు వస్తున్నారు. కనకదుర్గ ఆలయం సమీపంలో ఆత్కూరు నుంచి పెద్ద అవుటపల్లి వైపు వెళ్తున్న మరో ద్విచక్ర వాహనం వెంకటకృష్ణ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో వెంకటకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. ఢీకొట్టిన ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున్న పులి విక్రమ్‌కు కూడా గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరినీ చికిత్స నిమిత్తం సమీపంలోని పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై ఆత్కూరు ఎస్సై నరసింహమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
