రామప్ప జలాలు.. గణపసముద్రానికి తరలింపు..!

  • ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం..
  • భూపాలపల్లి ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు
  • నీటి విడుదలకు అనుమతులు ఇవ్వాలని అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం
  • ఎనిమిది మండలాలకు ప్రయోజనం
  • ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి/ములుగు : ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో భూపాలపల్లి నియోజకవర్గంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. సోమవారం ములుగు జిల్లాలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, భూపాలపల్లి, ములుగు జిల్లాల ఇరిగేషన్ శాఖ అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వర్షాభావ పరిస్థితులు, తాగునీటి అవసరాలు, నీటి లభ్యతపై అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి సీతక్క చర్చించారు. ముఖ్యంగా భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా రామప్ప చెరువు నుంచి వయా వంగపెల్లి వాని చెరువు మీదుగా గణపసముద్రం చెరువులోకి నీటిని విడుదల చేసే ప్రతిపాదనపై సమీక్షించారు.

ఉత్తమ్ దృష్టికి తీసుకెళ్లాలి..

రామప్ప చెరువు నుంచి గణపసముద్రం చెరువుకు నీటిని తరలించే అంశాన్ని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన అనుమతులు పొందేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. నీటి విడుదలకు సంబంధించి సాంకేతిక అంశాలను పరిశీలించి, ప్రభుత్వ స్థాయిలో అనుమతులు పొందేందుకు సమన్వయంతో ముందుకు సాగాలని ఆదేశించారు.

ఎనిమిది మండలాలకు ప్రయోజనం

రామప్ప చెరువు నుంచి నీటిని విడుదల చేయడం ద్వారా భూపాలపల్లి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా మెరుగుపడుతుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో తాగునీటి అవసరాలను ముందుగానే అంచనా వేసి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు తాగునీటి కొరత ఏర్పడకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క సూచించారు. నీటి వనరుల లభ్యత, అవసరాలు, సరఫరా వ్యవస్థపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని, ఇరిగేషన్, మిషన్ భగీరథ తదితర శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో రెండు జిల్లాల ఇరిగేషన్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.