తాగునీటి అవసరాలకు రామప్ప నుంచి నీరు విడుదల చేయండి

మంత్రి సీతక్కను కోరిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

గణపురం ఆంధ్రప్రభ: భూపాలపల్లి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు తాగునీరు అందించేందుకు రామప్ప చెరువు నుంచి గ్రావిటీ కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో సోమవారం ములుగులోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క భూపాలపల్లి, ములుగు జిల్లాల నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎల్‌నినో ప్రభావంతో తగినంత వర్షపాతం లేక రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిపై చర్చించారు. ముఖ్యంగా తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని రామప్ప చెరువు నుంచి వయా వంగపెల్లి, వాని చెరువు మీదుగా గణప సముద్రం చెరువులోకి నీటిని విడుదల చేసే అంశంపై సమీక్షించారు.

ఈ విషయాన్ని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన చర్యలు చేపట్టి నీటి విడుదలకు అనుమతులు పొందాలని అధికారులకు సూచించారు.

రామప్ప చెరువు నుంచి నీటిని విడుదల చేస్తే భూపాలపల్లి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల ప్రజలకు మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా మెరుగుపడుతుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ప్రజలకు తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క సూచించారు. సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నీటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

సమీక్షా సమావేశంలో నీటిపారుదల శాఖకు చెందిన పలువురు అధికారులు, గణపురం సర్పంచ్‌ కటుకూరి రాధిక శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.