వికసిత్ భారత్ లో భాగస్వాములు కావాలి..
కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ
భీమవరంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా యాత్ర
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : నేషన్ ఫస్ట్ స్ఫూర్తితో దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుకుంటూ వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా వేగంగా ముందుకు సాగుతోందని తెలిపారు. భారతదేశాన్ని ‘విశ్వగురు’గా తీర్చిదిద్దే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా భీమవరంలో సోమవారం భారీ తిరంగా యాత్ర ఘనంగా నిర్వహించారు. భీమవరంలోని జిల్లా బీజేపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ యాత్రను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, భీమవరం ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులుతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మతో పాటు కూటమి శ్రేణులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో జాతీయ జెండాలను చేతబూని ఉత్సాహంగా తిరంగా యాత్రలో పాల్గొన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన యాత్ర ఓవర్‌బ్రిడ్జి, ప్రకాశం చౌక్ మీదుగా కొనసాగింది.

మార్గమధ్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అడ్డ వంతెన మీదుగా ఏ ఎస్ ఆర్ నగర్‌లోని మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా’ ఉద్యమం 80వ స్వాతంత్ర్య దినోత్సవం, ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవాల స్ఫూర్తితో ఈ తిరంగా యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 10 నుంచి 14వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున తిరంగా యాత్రలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
అలాగే ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై, వాణిజ్య సంస్థలు, కార్యాలయాలపై జాతీయ జెండాను సగర్వంగా ఎగురవేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని తెలిపారు. యువత, విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాలను మరింతగా పెంపొందించడం, ‘నేషన్ ఫస్ట్’ స్ఫూర్తిని నింపడం, దేశం పట్ల ప్రతి ఒక్కరిలో బాధ్యతాభావాన్ని పెంపొందించడమే ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. దేశ ప్రగతిని అడ్డుకోవాలని ప్రయత్నించే శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
ప్రతి ఇంటా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, దేశభక్తి చాటాలని పిలుపునిచ్చారు. దేశ చరిత్ర, సంస్కృతి, జాతీయ గౌరవానికి ప్రాధాన్యతనిస్తూ గతంలో ఉన్న పలు పేర్లు, గుర్తులను మార్చి భారతీయతను ప్రతిబింబించేలా చర్యలు తీసుకున్నామని శ్రీనివాస వర్మ తెలిపారు. ఢిల్లీలోని రేస్ కోర్స్ రోడ్‌ను లోక్ కల్యాణ్ మార్గ్‌గా, రాజ్‌పథ్‌ను కర్తవ్య పథ్‌గా, మొఘల్ గార్డెన్స్‌ను అమృత్ ఉద్యాన్‌గా మార్చడం భారతీయ స్ఫూర్తి, జాతీయ గౌరవానికి ప్రతీకలని పేర్కొన్నారు. ఈ తిరంగా యాత్రలో జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, ‘హర్ ఘర్ తిరంగా’ జిల్లా ఇన్‌చార్జ్ షేక్ మొహుద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శులు కలిదిండి వినోద్ వర్మ, తోట గంగరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు కాయిత సురేంద్ర, తెలుగుదేశం పార్టీ నాయకులు బాపిరాజు, జనసేన నాయకులు చంద్రశేఖర్, ఇతర కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
