కాళేశ్వరంలో బెల్ట్‌ షాపులు మూసివేయాలి

యువత భవిష్యత్‌ను నాశనం చేస్తున్న మద్యం విక్రయాలపై చర్యలు తీసుకోవాలి

మహాదేవపూర్, ఆంధ్రప్రభ : కాళేశ్వరం గ్రామంలో విచ్చలవిడిగా కొనసాగుతున్న బెల్ట్‌ షాపులను తక్షణమే మూసివేయాలని కాళేశ్వరం ఎమ్మార్పీఎస్‌ ప్రధాన కార్యదర్శి లేతకారి రాజశేఖర్‌ డిమాండ్‌ చేశారు. గ్రామంలో 24 గంటల పాటు మద్యం అందుబాటులో ఉండటంతో యువత మద్యానికి బానిసలై తమ భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న బెల్ట్‌ షాపులపై పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు వెంటనే దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ముఖ్యంగా కాళేశ్వరం–మహాదేవపూర్‌ ప్రధాన రహదారిలోని కొన్ని బెల్ట్‌ షాపుల్లో కల్తీ మద్యం, గుడుంబా విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామంలో అక్రమ మద్యం విక్రయాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు యువతను చెడు వ్యసనాల నుంచి కాపాడేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.

బెల్ట్‌ షాపులపై వచ్చిన ఫిర్యాదులను అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే ప్రజలను సమీకరించి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఇప్పటికైనా పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు స్పందించి కాళేశ్వరంలో అక్రమ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని లేతకారి రాజశేఖర్‌ కోరారు.