ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలి..
- నిరుద్యోగులకు రూ.3 వేల భృతి అమలు చేయాలి
- బాపట్లలో కదం తొక్కిన వైసీపీ.. కలెక్టరేట్ వరకు భారీ నిరసన ర్యాలీ
బాపట్ల బ్యూరో, ఆంధ్రప్రభ ; డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అక్రమాలు, అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో బాపట్లలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, నిరుద్యోగులు, యువతతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
కలెక్టరేట్ మార్గంలోని ఫ్లైఓవర్ కింద నుంచి ప్రారంభమైన ర్యాలీ పటేల్‌నగర్ మీదుగా కొనసాగింది. మహిళలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ వరకు ఆందోళన కొనసాగింది. పార్టీ పరిశీలకుడు సురేంద్ర కార్యక్రమంలో పాల్గొని నాయకులు, కార్యకర్తలకు సంఘీభావం తెలిపారు.
డీఎస్సీపై అనుమానాలు నివృత్తి చేయాలి..

ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ డీఎస్సీ నియామకాల వ్యవహారంపై అనేక అనుమానాలు, ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల భవిష్యత్తుతో ముడిపడిన నియామకాల ప్రక్రియపై పారదర్శకత ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అక్రమాలకు తావులేకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
విద్యార్థుల నిధులు ఏమయ్యాయి?
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఫీజులు చెల్లించలేక విద్యార్థులు, వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బకాయి నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు.
రూ.3 వేల నిరుద్యోగ భృతి ఏదీ?
నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. హామీలను అమలు చేయకుండా నిరుద్యోగ యువతను ప్రభుత్వం నిరాశకు గురిచేస్తోందని ఆరోపించారు.
ఆందోళనలు ఉధృతం చేస్తాం..

ప్రభుత్వం తమ డిమాండ్లపై తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని వైసీపీ నాయకులు హెచ్చరించారు. ప్రజా సమస్యలపై దశలవారీగా ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్‌బాబు, ఏడుకొండలరెడ్డి, ఎల్లావుల ఏడుకొండలు, లీల శ్రీనివాస్‌రెడ్డి, కర్లపాలెం ఎంపీపీ వనజ, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
