విషాదం.. చెరువులో మునిగి ఇద్దరు బాలుర మృతి
కుబీర్, ఆంధ్రప్రభ: సరదాగా ఈత కొట్టేందుకు చెరువుకు వెళ్లిన ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన కుబీర్ మండలంలోని డోడర్నా చెరువు వద్ద చోటుచేసుకుంది.
కుబీర్‌కు చెందిన ముగ్గురు బాలురు డోడర్నా చెరువుకు ఈత కొట్టేందుకు వెళ్లారు. ఒక బాలుడు చెరువు ఒడ్డున ఉండగా, సోఫియాన్ (10), గణేష్ ఈత కొట్టేందుకు నీటిలోకి దిగారు.
చెరువులో లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. స్థానికులు వెంటనే వారిని బయటకు తీశారు. అయితే సోఫియాన్ (10) అప్పటికే మృతి చెందాడు.
గణేష్‌ను చికిత్స నిమిత్తం బైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గణేష్ మృతి చెందాడు.
ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పిల్లల మృతితో కుబీర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
