అనుమతుల్లేని ధర్నాలు, ర్యాలీలు సహించేది లేదు…
వైసీపీ అరాచకాలకు చట్టపరంగా కళ్లెం వేస్తాం
ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు
రోడ్లపైకి వచ్చి నచ్చినట్లు వ్యవహరిస్తే ఊరుకునేది లేదు
డీఎస్సీ పై చర్చకు లోకేష్ సిద్ధం
వైసీపీ నేతలు పిచ్చి చేష్టలు మానుకోవాలి
ప్రభుత్వ విప్ బోండా ఉమా
(విజయవాడ, ఆంధ్రప్రభ) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న అనుమతుల్లేని ధర్నాలు, ర్యాలీలను ప్రభుత్వం ఏమాత్రం సహించదని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బందులు, అసౌకర్యం కలిగించేలా రోడ్లను ఆక్రమించి ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. అనుమతులు లేకుండా బలవంతంగా, చట్టవిరుద్ధంగా నిర్వహించే కార్యక్రమాలపై పోలీసులు కేసులు నమోదు చేస్తారని స్పష్టం చేశారు.
ఉనికిని చాటుకునే ప్రయత్నం..
వైసీపీ తన రాజకీయ ప్రాభవాన్ని కోల్పోయి అరాచకాన్ని నమ్ముకుంటోందని బోండా ఉమా విమర్శించారు. ధర్నాలు, ర్యాలీలకు జనాలను సమీకరించి వారికి మద్యం, ఇతర ప్రలోభాలు చూపిస్తున్నారంటూ ఆరోపించారు. ప్రజలు, ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు రాకపోకలు సాగించే మార్గాల్లో ఆందోళనలు నిర్వహించి వారిని భయభ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. ఇటీవల విజయవాడలోని ప్రభుత్వ ప్రెస్ సమీపంలోని బస్స్టాప్ను ఆక్రమించి ప్రజలకు ఇబ్బందులు కలిగించిన ఘటనపై ప్రభుత్వం తగిన విధంగా స్పందించిందని పేర్కొన్నారు. మళ్లీ అదే తరహాలో ర్యాలీల పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు.
డీఎస్సీ అర్థంలేని ఆరోపణలు…
డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను కూడా బోండా ఉమా ఖండించారు. కర్నూలులో డీఎస్సీ అభ్యర్థులు ప్రభుత్వానికి మద్దతుగా రోడ్డెక్కిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించిన తమను రాజకీయ ప్రయోజనాల కోసం బలిపశువులను చేయవద్దని అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారని అన్నారు. ఎనిమిది నెలల క్రితమే నియమితులై ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారిపై ఇప్పుడు అక్రమాల పేరుతో ఆరోపణలు చేయడం సరికాదన్నారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపిస్తే వాటిపై చర్చకు రావాలని, ఎక్కడ అక్రమాలు జరిగాయో ఆధారాలతో నిరూపించాలని నారా లోకేష్ ఇప్పటికే స్పష్టంగా ప్రకటించారని బోండా ఉమా తెలిపారు. అయినప్పటికీ చర్చకు రాకుండా ధర్నాలు, ర్యాలీలతో రాజకీయ గందరగోళం సృష్టించడం తగదన్నారు.
చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు…
అనుమతులు లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించి చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేయడం ద్వారా కఠినంగా వ్యవహరిస్తామని బోండా ఉమా స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే ప్రభుత్వం చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
