వైసీపీ నేతలకు నోటీసులు, హౌస్ అరెస్టులు..
గుడివాడ, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో మరోసారి రాజకీయ సమీకరణాలు వేడెక్కాయి. ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా గుడివాడ పరిసర ప్రాంతాల్లోని పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కీలక నేతలకు పోలీసులు అర్ధరాత్రి వేళల్లో నోటీసులు జారీ చేయడం, గృహ నిర్బంధాలు (హౌస్ అరెస్టులు) విధించడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత, హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

పోలీసుల భారీ మోహరింపు శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా పోలీసులు గుడివాడ వ్యాప్తంగా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. నేతలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా, ఎటువంటి నిరసన ప్రదర్శనలు లేదా పోటాపోటీ కార్యక్రమాలకు పాల్పడకుండా ఉండేందుకు ప్రధాన నాయకుల నివాసాల వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. గుడివాడతో పాటు రాష్ట్రంలోని మండలము లో పలు ప్రాంతాల్లోనూ వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని ఇటువంటి ముందస్తు హౌస్ అరెస్టుల పర్వం కొనసాగుతుండటం గమనార్హం.

రాజకీయ కక్షసాధింపు చర్యలే చేస్తుంది వైసీపీ ఆరోపణ కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తోందని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ప్రజా సమస్యల పై పోరాడకుండా అడ్డుకునేందుకే పోలీసులు, అధికార యంత్రాంగాన్ని వాడుకుంటూ అక్రమ కేసులు, అర్ధరాత్రి నోటీసులు, గృహ నిర్బంధాలకు పాల్పడుతున్నారని స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు, పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగానే తాము చట్టప్రకారం వ్యవహరిస్తున్నామని పోలీసు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తాజా పరిణామాలతో గుడివాడ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
