అమ్మా అని పిలవకముందే.. అనాథ
అమ్మ ఒడికి బదులు.. ముళ్లపొదల్లో!
నస్పూర్, ఆంధ్రప్రభ: ముక్కుపచ్చలారని పసికందు.. ఇంకా అమ్మా అని పిలవడం కూడా తెలియని ఆ చిన్నారి ఈ లోకంలోకి అడుగుపెట్టిన కొద్దిసేపటికే తల్లిదండ్రుల చేతుల్లోనే అనాథగా మారింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులే కనికరం లేకుండా ఆ పసిబిడ్డను ముళ్లపొదల్లో పడేశారు. ఏం జరిగిందో తెలియని ఆ శిశువు.. ఆకలితో, చలితో, భయంతో విలవిల్లాడుతూ ముళ్ల మధ్యే మిగిలిపోయింది. మనసున్న ప్రతి ఒక్కరినీ కలచివేసే ఈ ఘటన మానవత్వానికే మచ్చగా నిలిచింది. ఈ అమానవీయ ఘటన మంచిర్యాల జిల్లా, నస్పూర్ పట్టణంలోని లక్ష్మీ నగర్ లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో లక్ష్మీనగర్ తహసీల్దార్ కార్యాలయం దగ్గర నవజాత శిశువు, అప్పుడే పుట్టిన మగ బిడ్డను కవర్లో చుట్టి చెట్ల పొదల్లో విడిచి వెళ్లారు. బాబు ఏడుపు గమనించిన చుట్టుపక్కల వారు 112కి కాల్ చేయగా వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పసికందును(బాబు)ను అంబులెన్స్ లో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
