ప్రియాంక ఘటనపై తూర్పుగోదావరి ఎస్పీ కీలక వ్యాఖ్యలు..!
రాజమహేంద్రవరం, ఆంధ్రప్రభ : రాజమహేంద్రవరంలో వైద్య విద్యార్థిని ప్రియాంక, ఆమెతో ఉన్న ఉమేష్‌పై జరిగిన కారు దాడి ఘటన సాధారణ రోడ్డు ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వకంగా జరిగిన క్రిమినల్ చర్యగా పోలీసులు పరిగణిస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కిషోర్ తెలిపారు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన అనంతరం ప్రియాంకను హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు ఆధారాలు లభించడంతో నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఆగస్టు 3న ప్రసాద్ ఆదిత్య మాల్ సమీపంలో స్కూటీపై వెళ్తున్న ప్రియాంక, ఉమేష్‌ను కారు ఢీకొట్టింది. ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీలను పరిశీలించగా.. నిందితులు ఉద్దేశపూర్వకంగానే స్కూటీని ఢీకొట్టినట్లు స్పష్టమైందని ఎస్పీ తెలిపారు. మొదట రోడ్డు ప్రమాదంగా భావించినప్పటికీ, ఫుటేజీల పరిశీలన అనంతరం కేసు స్వరూపాన్ని మార్చి హత్యాయత్నం కింద దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
మూడుసార్లు ఢీకొట్టినట్లు ఆధారాలు
సీసీ ఫుటేజీల ప్రకారం ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటీని కారుతో మూడుసార్లు ఢీకొట్టినట్లు ఎస్పీ తెలిపారు. మొదట ఢీకొట్టిన అనంతరం కారును వెనక్కి తీసుకెళ్లి మరోసారి ఢీకొట్టినట్లు ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి కీలక ఆధారాలను కొన్ని గంటల్లోనే సేకరించామని, ఉమేష్ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసినట్లు వెల్లడించారు.
కేసును పటిష్టంగా దర్యాప్తు చేసేందుకు న్యాయ సలహాదారులు, సీఏ, డీఎస్పీ, ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదితో సంప్రదింపులు జరిపినట్లు ఎస్పీ తెలిపారు. నిందితులు సురావరపు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్‌ను ఆగస్టు 6న అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. ప్రస్తుతం వారు ఈ నెల 22 వరకు రిమాండ్‌లో ఉన్నట్లు వెల్లడించారు.
మద్యం మత్తులో ఉన్నట్లు నిర్ధారణ
ఘటన సమయంలో నిందితులు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందని ఎస్పీ తెలిపారు. ప్రియాంక, ఉమేష్ సినిమా చూసి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు వివరించారు. మాల్ వద్ద ప్రియాంక, నిందితుల మధ్య వాగ్వాదం జరిగిన అనంతరం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని చెప్పారు.
ప్రియాంక ప్రస్తుతం హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారని, ఆమె తండ్రితో పోలీసులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని ఎస్పీ తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల నుంచి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నట్లు చెప్పారు. కేసులో ఫోన్ కాల్ వివరాలు, సీసీ ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాలను కూడా పరిశీలిస్తున్నామని ఎస్పీ తెలిపారు. దర్యాప్తును సమగ్రంగా కొనసాగించి చట్టపరంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
