చినుకు పడితే చిత్తడే.. మంథనిలో రోడ్ల దుస్థితి

మంథని, ఆంధ్రప్రభ: మంథని పట్టణంలో కురుస్తున్న వర్షాలకు ప్రధాన రహదారుల పరిస్థితి అధ్వానంగా మారింది. చినుకు పడితే చాలు రోడ్లన్నీ నీటితో నిండి చిత్తడిగా మారుతున్నాయి. శ్రీపాద చౌక్‌ సమీపంలోని కూరగాయల మార్కెట్‌, బోయిన్‌పేట్‌, మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతింది. పెద్దపెద్ద గుంతలు ఏర్పడటంతో వర్షపు నీరు అందులో నిలిచి రహదారి చెరువును తలపిస్తోంది. గుంతల్లో నీరు చేరడంతో రోడ్డు ఎక్కడ ఉందో తెలియక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలను ఎదుర్కొంటూ ప్రయాణించాల్సి వస్తోంది.

ఈ మార్గంలో ప్రతిరోజూ వందలాది మంది విద్యార్థులు, వ్యాపారులు రాకపోకలు సాగిస్తుంటారు. వర్షం పడినప్పుడు రోడ్డుపై నడవడానికే భయంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంతల్లో పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రహదారికి తక్షణమే మరమ్మతులు చేపట్టి ఇబ్బందులు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.