గాంధీభవన్‌లో ఘనంగా క్విట్ ఇండియా దినోత్సవం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : క్విట్ ఇండియా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, మాజీ క్రికెటర్ అజారుద్దీన్, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
1942 ఆగస్టు 9న మహాత్మాగాంధీ ఇచ్చిన ‘క్విట్ ఇండియా’ పిలుపు దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక మలుపుగా నిలిచిందని నాయకులు పేర్కొన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఆ ఉద్యమం దేశ ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్షను మరింత బలపరిచిందని గుర్తుచేశారు.
గాంధీభవన్ గాంధీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గాంధీజీ జీవితం, సిద్ధాంతాలు, స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రను ప్రతిబింబించే ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. అదేవిధంగా 1,500 గాంధీ విగ్రహాలను ప్రదర్శనకు ఉంచడంతో పాటు 150 చరఖాలను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిని నేటి తరం తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర ఉద్యమ చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకుని ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోవాలని సూచించారు. విద్యార్థులు గాంధీజీ ఆశయాలను అర్థం చేసుకుని సమాజం కోసం బాధ్యతగా పనిచేయాలని కోరారు.
గాంధీజీ జీవితం, స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను యువతకు, విద్యార్థులకు చేరువ చేయడమే కార్యక్రమం ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూ దేశ ఐక్యత, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
