ఇంద్రకీలాద్రిపై భక్తజన సందోహం

ఆషాఢ సారెకు పోటెత్తిన మహిళలు
25వ రోజు 59 సారె బృందాలు.. 21,342 మంది రాక
సామాన్య భక్తులకే పెద్దపీట.. ఉచిత దర్శనాలు

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: శ్రీ కనకదుర్గమ్మను ఇంటి ఇలవేల్పుగా, ఆడపడుచుగా భావిస్తూ ఆషాఢ మాసంలో పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, సారె సమర్పించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన మహిళా భక్తులతో ఇంద్రకీలాద్రి శనివారం భక్తజన సందోహంగా మారింది. ఆషాఢ సారె సమర్పణ 25వ రోజు 59 సారె బృందాలకు చెందిన 21,342 మంది మహిళా భక్తులు అమ్మవారిని దర్శించుకుని సారె సమర్పించారు. వారాంతపు సెలవు కావడంతో సాధారణ భక్తుల రద్దీ కూడా భారీగా పెరిగింది. దేవస్థానం రోజువారీ గణాంకాల ప్రకారం శనివారం మొత్తం 64,005 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు సంప్రదాయబద్ధంగా పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, సారె సామగ్రిని తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. సారె బృందాలకు దేవస్థానం ఉచిత దర్శనం, అమ్మవారి ఆశీర్వచనంతో పాటు ఉచిత ప్రసాదాలను అందించింది. ఈవో వి.కె. శీనా నాయక్‌ స్వయంగా సారె బృందాల సభ్యులకు ప్రసాదాలు అందజేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు నిరంతరం ఏర్పాట్లను పర్యవేక్షించారు.

సామాన్య భక్తులకు ప్రాధాన్యం.. రద్దీ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు దేవస్థానం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉదయం 9 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేయడంతో పాటు ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్ని రకాల దర్శన టికెట్లను నిలిపివేసి క్యూలైన్లన్నింటినీ ఉచిత దర్శన మార్గాలుగా మార్చారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వీఐపీ దర్శనాలను కూడా పూర్తిగా నిలిపివేశారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లలోని భక్తులకు సంచార నీటి డబ్బాల ద్వారా చల్లటి తాగునీటిని అందించారు. చంటిబిడ్డల తల్లులు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా దర్శనం కల్పించారు. రద్దీలో కుటుంబ సభ్యుల నుంచి తప్పిపోయిన ఓ వృద్ధురాలిని ఈవో శీనా నాయక్‌ గుర్తించి మైక్‌ ద్వారా ప్రకటన చేయించి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. భక్తుల భద్రత, సౌకర్యాల కోసం దేవస్థానం చేపట్టిన చర్యలకు భక్తుల నుంచి ప్రశంసలు లభించాయి.

ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో సారె.. దేవస్థానం ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలోనూ శనివారం అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సారె సమర్పించారు. ఆలయ ఈఈ రమాదేవి, డీఈఈ అశోక్‌కుమార్‌, రవీంద్ర తదితరులు జమ్మిదొడ్డి నుంచి సారెతో ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. వీరికి ఈవో వి.కె. శీనా నాయక్‌, ఉప ప్రధాన అర్చకులు శంకర శాండిల్య స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయంలోని ఆరో అంతస్తులో సారె సమర్పించారు.

రాష్ట్ర సుభిక్షం కోసం సారె.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరిపై కనకదుర్గమ్మ కరుణాకటాక్షాలు ప్రసరించాలని ఆకాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో సుమారు 300 మంది ప్రతినిధులు మేళతాళాల నడుమ సారెను ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. రావిచెట్టు సెంటర్‌ నుంచి ఇంద్రకీలాద్రికి చేరుకున్న ప్రతినిధులకు దేవస్థానం ఏఈవో గంగాధర్‌ స్వాగతం పలికి దర్శనం కల్పించారు. అనంతరం అమ్మవారికి నాలుగు పట్టు చీరలు సమర్పించగా అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. రాష్ట్ర అధ్యక్షుడు కోనూరు సతీష్‌శర్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలు, సుభిక్షం కోసం అమ్మవారిని ప్రార్థిస్తూ సారె సమర్పించినట్లు తెలిపారు.

ఆషాఢ మాసంలో కనకదుర్గమ్మను ఇంటి ఆడపడుచుగా భావించి సారె సమర్పించే సంప్రదాయానికి రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తుండటంతో ఇంద్రకీలాద్రిపై శనివారం అంతటా ఆధ్యాత్మిక, పండుగ వాతావరణం నెలకొంది.