సాగు కోసం అన్నదాతల అవస్థలు..
నాగాయలంక, ఆంధ్రప్రభ: ఖరీఫ్ సాగులో అన్నదాతల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. సకాలంలో వర్షాలు కురవకపోవడం, సమృద్ధిగా సాగునీరు అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాగాయలంక సౌత్, సెంట్రల్ కాలువలకు కొద్దిమేర నీరు చేరడంతో రైతులు వరి సాగు పనులు ప్రారంభించారు. కాలువల ఎగువ ప్రాంతాలైన వక్కపట్లవారిపాలెం, నంగేగడ్డ, మర్రిపాలెం, భావదేవరపల్లి, రేమాలవారిపాలెం, టి.కొత్తపాలెం గ్రామాల్లో రైతులు వరి నాట్లు వేస్తున్నారు.
పంట బోదుల తూములకు కాలువ నీరు అందకపోవడంతో రైతులు ఇంజన్ల సాయంతో పొలాలను తడిపి నాట్లు వేయాల్సి వస్తోంది. నాగాయలంక మండలంలో అడపాదడపా కురుస్తున్న వర్షాలు కొంతమేర వరి సాగుకు దోహదపడుతున్నాయి. అయితే సమృద్ధిగా వర్షాలు కురిస్తేనే వరి సాగు సజావుగా సాగుతుందని రైతులు చెబుతున్నారు. సాగునీరు సక్రమంగా అందించాలని అన్నదాతలు కోరుతున్నారు.
