వీడియో కాల్‌లో కన్నీళ్ల కడచూపు..
లెక్కలేనన్ని ఆంక్షలు.. అంత్యక్రియలకు చేరుకోలేని పిల్లలు
తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ.. ప్రతి ఇంటికీ విదేశీ బంధం
వృద్ధుల ఒంటరి జీవితం.. వీడియో కాల్‌కే పరిమితమైన అనుబంధం
మారుతున్న సంప్రదాయాలు.. వీడియో కాల్‌లోనే అంతిమక్రియలు
జీవితాంతం వెంటాడే జ్ఞాపకం.. చివరి చూపు దక్కని పశ్చాత్తాపం
వృద్ధులకు అండగా సహాయ కేంద్రాలు అవసరం
హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి: అది తెలంగాణ రాష్ట్రం లోని పెద్దపల్లి జిల్లా బుధవారిపేట అనే కుగ్రామం. ఇంటి ముందు బంధువుల రోదనలు. పక్కనే శవపేటిక. అవతల శ్మశానంలో చితి. చితి తండ్రి పార్థివదేహం. కానీ చితికి నిప్పు పెట్టా ల్సిన కొడుకు అక్కడ లేడు. అతను అమెరికాలో అర్ధరాత్రి మొబైల్ స్క్రీన్పై ప్రత్యక్షం.. పక్కనే రోదిస్తున్న భార్య, కొడుకు, కూతురు.
వెక్కివెక్కి ఏడుస్తూ.. నాన్నా ఒక్కసారి కళ్ళు తెరవండి అంటూ అరిచిన అరుపులు గాలిలోనే కలిసిపోయాయి. వీడియో కాల్ అప్పుడే కట్ చేయొద్దు అని చితి దగ్గరి బంధువులను వేడుకుంటు న్నాడు. తల్లిదండ్రుల అంతిమ యాత్రలో ముందుండి నడవాల్సిన కొడుకు వేల కిలోమీటర్ల దూరంలో మొబైల్ ఫోన్ స్క్రీనే పరిమి తమవ్వాల్సిన దుస్థితి. ఉద్యోగ బాధ్యతలు… విమాన ప్రయాణాల జాప్యం… చివరికి తన జీవితంలో అత్యంత బాధాకరమైన క్షణాన్ని మొబైల్ స్క్రీన్పైనే చూసి తల్లిదండ్రులకు వీడ్కోలు చెబుతున్నాడు. ఇది ఆ ఒక్క కుటుంబం విషాద కథ కాదు. ప్రపంచీకరణ వేగంతో మారుతున్న భారతీయ కుటుంబ వ్యవస్థకు అద్దం పట్టే వాస్తవం. గత రెండు దశాబ్దాల్లో భారతదేశం ప్రపంచానికి అత్యంత నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించిన దేశంగా ఎదిగింది. మన దేశం నుంచివిదేశాలకు వెళ్లిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా ఐటీ, వైద్య, ఇంజనీరింగ్, పరిశోధన, ఉన్నత విద్య కోసం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, జర్మనీ, గల్ఫ్ దేశాలకు లక్షలాది మంది యువతీ, యువకులు వలస వెళ్లారు. తెలుగు రాష్ట్రాల నుంచే ప్రతి ఏడాది వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు విదేశాలకు వెళ్తున్నారు. అమెరికాలో తెలుగు మాట్లాడే కుటు ంబాల సంఖ్య లక్షల్లో ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. వారిలో చాలామంది ఉద్యోగాలు, శాశ్వత నివాసం, పౌరసత్వం తీసుకుని విదేశాల్లోనే స్థిరపడుతున్నారు. వృద్ధ తల్లిదండ్రులు మాత్రం తాము పుట్టిన ఊరిని తమ ఇంటిని బంధు వర్గాన్ని వదిలి విదేశాలకు వెళ్లేందుకు సుముఖత చూపడం లేదు. ఈ రెండు తరాల మధ్య ఏర్పడుతున్న భౌగోళిక దూరం భావోద్వేగ దూరంగా మారుతోంది.
లెక్కలేనన్ని ఆంక్షలు…
తల్లిదండ్రుల మరణవార్త తెలిసిన వెంటనే విమానం ఎక్కడం ప్రతి ఒక్కరికీ సాధ్యం కాదు. అత్యవసరంగా విమాన టికెట్లు అందుబాటులో లేక పోవడం, ప్రయాణానికి 20 నుంచి 40 గంటల సమయం పట్టడం, ఉద్యోగ సంస్థలు వెంటనే సెలవులు మంజూరు చేయకపోవడం, వీసా, ఇమ్మిగ్రేషన్ పరిమితులు, చిన్నపిల్లలు, కుటుంబ బాధ్యతలు, లక్షల్లో ఖర్చ య అత్యవసర ప్రయాణ వ్యయం. ఈ కారణాల వల్ల చాలా మంది పిల్లలు అంత్యక్రియలకు చేరుకోలేకపోతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాష్ట్రాలు దేశంలో అత్యధికంగా విదేశాలకు వలస వెళ్లే రాష్ట్రాల్లో అగ్రభాగాన ఉన్నాయి. ప్రత్యే కించి హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు విదేశీ వలస కేంద్రాలుగా మారాయి. తెలుగు రాష్ట్రాలకు సంబం ధించి ఏ కుగ్రామాన్ని తీసుకున్నా ఆ గ్రామం నుంచి కనీసం ఒక్కరైనా విదేశాల్లో ఉంటున్నారు. ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరూ విదేశాల్లో ఉండటం ఇప్పుడు సాధారణంగా మారింది. చివరికి నలుగురు పిల్లలున్న వారంతా విదేశాల్లో ఉంటూ చుట్టం చూపుగా రెండు, మూడేళ్లకొకసారి సొంతూళ్ళకు వచ్చి నెల రోజులపాటు తల్లిదండ్రులు, బంధువులతో గడిపి వెళుతున్న ఘటనలున్నాయి.
వృద్ధుల ఒంటరి జీవితం
ఒకప్పుడు సాయంత్రం ఇంటికి వస్తే పిల్లల సందడి. ఇప్పుడు ఇంట్లో ఇద్దరు వృద్ధులు మాత్రమే. ఉదయం వీడియో కాల్ … రాత్రి వాట్సాప్ మెసేజ్…ఇదే అనుబంధంగా మారింది. పక్కింటివాళ్లు, బంధువులే అవసరమైనప్పుడు ఆసరా అవుతున్నారు.
మారుతున్న సంప్రదాయాలు
హిందూ సంప్రదాయం ప్రకారం తండ్రికి పెద్ద కుమారుడు, తల్లికి చిన్న కుమారుడు చితికి నిప్పు పెట్టడం ఆనవాయితీగా భావిస్తారు. కానీ ఇప్పుడు… తమ్ముడు, అల్లుడు, మనవడు, బంధువులు, గ్రామ పెద్దలు, స్వచ్చంద సంస్థలు అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఘటనలు సర్వ సాధారణంగా మారాయి. కొన్ని చోట్ల వీడియో కాల్లో పురోహితుడు చెప్పిన మంత్రాలు వింటూ విదేశాల్లో ఉన్న కుమారుడు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భాలూ ఉన్నాయి. ఒంటరిగా జీవిస్తున్న వృద్ధులకు కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోవడంతో అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకొ స్తున్నా యి. వారి సేవల్లో ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని తీసుకు రావడం, అంత్యక్రియల ఏర్పాట్లు చేయడం, శ్మశాన కార్యక్ర మాలు, అవసరమైన పత్రాల నిర్వహణ, కుటుంబ సభ్యులకు వీడియో కాల్ ద్వారా చూపించడం వంటి సేవలు కూడా చేస్తున్నాయి. ఇది సేవాభావానికి నిదర్శనం అయినప్పటికీ, కుటుంబ వ్యవస్థలో వస్తున్న మార్పులను చాలా స్పష్టంగా .
జీవితాంతం వెంటాడే జ్ఞాపకం
మానసిక నిపుణుల అభిప్రాయం ప్రకారం… తల్లిదండ్రుల చివరి క్షణాల్లో దగ్గర ఉండలేకపోవడం వల్ల చాలామంది లో అపరాధ భావన, నిద్రలేమి, డిప్రెషన్, జీవితాంతం మిగిలిపోయే పశ్చాత్తాపం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. నేను డబ్బు సంపాదించాను… కానీ అమ్మ చివరి చూపు చూడలేకపోయాను అనే బాధను చాలామంది జీవితాంతం మోస్తున్నారు. వీడియో కాల్స్…లైవ్ స్ట్రీమింగ్… హైడెఫినిషన్ కెమెరాలు…ప్రపంచాన్ని అరచేతిలోకి తెచ్చాయి. కానీ… తల్లి చేతిని చివరిసారి పట్టే అనుభూతిని…. తండ్రి భుజంపై చేయి వేసే ఆత్మీయతను… ఏ సాంకేతికతా ఇవ్వలేకపోతోంది.
నిపుణులు సూచిస్తున్న పరిష్కారాలు
ఒంటరిగా ఉన్న వృద్ధుల కోసం ప్రతి మండలంలో సహాయ కేంద్రాల ఏర్పాటు, అత్యవసర పరిస్థితుల్లో విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులకు వేగవంతమైన ప్రయాణ సహకారం, ప్రతి కుటుంబం ముందుగానే అత్యవసర సంప్రదింపు ప్రణాళిక రూపొందించుకోవడం, వృద్ధుల ఆరోగ్య పర్యవేక్ష ణకు స్థానిక స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం, సమాజంలో పొరుగువారి సహకార వ్యవస్థను బలోపేతం చేయడమని చెబుతున్నారు.
