నిండుకుండలా కౌలాస్‌నాలా ప్రాజెక్టు..

జుక్కల్, ఆంధ్రప్రభ : జుక్కల్ మండలం సావర్‌గాం గ్రామం వద్ద ఉన్న మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టు కౌలాస్‌నాలా నిండుకుండలా మారడంతో ఈ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శనివారం సాయంత్రం ప్రాజెక్టులోకి 765 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో నీటిమట్టం 457.20 మీటర్లకు చేరుకుంది.

కౌలాస్‌నాలా ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ సామర్థ్యం 458 మీటర్లు కాగా, 1.237 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం వరద నీటితో ప్రాజెక్టు కళకళలాడుతోంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టానికి చేరువ కావడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. సాగునీటి అవసరాలకు నీరు అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంతంలో వ్యవసాయ పనులకు మరింత ఊతం లభిస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.