ప్రజల అభిప్రాయాలతో పాలనలో మార్పులు..

  • తప్పిదాలను సరిదిద్దుకుంటూ మెరుగైన పాలన అందిస్తాం
  • ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌
  • డీఎస్సీపై వైఎస్సార్‌సీపీ అవాస్తవ ప్రచారం..
  • 50 మంది బూత్‌ కన్వీనర్లకు సన్మానం
  • రూ.2.50 లక్షల నగదు ప్రోత్సాహకాలు అందజేత

(విజయవాడ, ఆంధ్రప్రభ) : కూటమి ప్రభుత్వ పాలనలో చిన్నపాటి తప్పిదాలు ఉంటే ప్రజలను అడిగి తెలుసుకుని వాటిని సరిదిద్దుకుంటూ మెరుగైన పాలన అందిస్తామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అన్నారు. శనివారం 12వ డివిజన్‌లోని రఘు గార్డెన్స్‌లో జరిగిన కార్యక్రమంలో టీడీపీ డోర్‌–టు–డోర్‌ కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేసిన 50 మంది బూత్‌ కన్వీనర్లను సన్మానించి, ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున మొత్తం రూ.2.50 లక్షల నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో డోర్‌–టు–డోర్‌ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోందని, ఇప్పటివరకు 30 శాతం పూర్తయిందన్నారు.

ప్రజలను నేరుగా కలవడం ద్వారా ప్రభుత్వ పాలనపై వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకుంటున్నామని చెప్పారు. డీఎస్సీపై వైఎస్సార్‌సీపీ నాయకులు అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు ఎలాంటి అక్రమ చెల్లింపులు చేయలేదని చెబుతున్నారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ తన మనుగడ కోసం చేస్తున్న ప్రచారంతో ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని కూడా కోల్పోతోందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ చిత్తశుద్ధితో పనిచేస్తోందని, డోర్‌–టు–డోర్‌ ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తామని గద్దె రామమోహన్‌ తెలిపారు. కార్యక్రమంలో ముమ్మనేని ప్రసాద్‌, పొట్లూరి సాయిబాబు, పేరేపి ఈశ్వర్‌, దాసరి గాబ్రియేల్‌, సుఖసాని కృష్ణప్రసాద్‌, దోమకొండ రవి, కొక్కిరి తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.