జాతీయ హాకీ పోటీలకు మిద్దె శిశిర..
నంద్యాల నూనెపల్లె, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా క్రీడా రంగానికి మరో అరుదైన గుర్తింపు లభించింది. జిల్లా కేంద్రానికి చెందిన ప్రతిభావంతమైన యువ హాకీ క్రీడాకారిణి మిద్దె శిశిర గ్రేస్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. మహారాష్ట్రలోని పుణెలో ఈ నెల 12 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న 16వ జాతీయ అండర్–21 జూనియర్ ఉమెన్ హాకీ పోటీలకు ఆమె ఎంపికైనట్లు హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు చాణిక్యరాజు, నంద్యాల జిల్లా కార్యదర్శి సునీల్ ముత్యం వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున నంద్యాల జిల్లా నుంచి మిద్దె శిశిర గ్రేస్ ప్రాతినిధ్యం వహించనుంది. రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చిన్న వయసులోనే హాకీలో ప్రతిభను చాటుకుంటూ జాతీయ స్థాయికి ఎదగడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు చాణిక్యరాజు మాట్లాడుతూ శిశిర గ్రేస్ జాతీయ స్థాయి పోటీల్లో ఆత్మవిశ్వాసంతో ఆడి ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్‌కు, నంద్యాల జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఆమె ఎంపిక జిల్లాలోని ఇతర యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. నంద్యాల జిల్లా హాకీ క్రీడాకారులకు శిక్షణ అందిస్తూ ప్రతిభను వెలికితీసేందుకు కృషి చేస్తున్న కోచ్‌లు, అసోసియేషన్ ప్రతినిధుల కృషిని పలువురు అభినందించారు. శిశిర గ్రేస్ జాతీయ పోటీల్లో రాణించి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత అవకాశాలు అందుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కోచ్ శ్రావణ్‌కుమార్, పలువురు క్రీడాకారులు పాల్గొని శిశిర గ్రేస్‌కు అభినందనలు తెలిపారు.
