నకిలీ పత్రాలతో భూమి ఆన్లైన్..
- విచారణతో రద్దు చేసిన అధికారులు!
- బెదిరింపులకు పాల్పడుతున్నఅక్రమార్కుడిపై పోలీసులకు వృద్ధుల ఫిర్యాదు
నకరికల్లు, ఆంధ్రప్రభ : నకిలీ పత్రాలు సృష్టించి అధికారులను తప్పుదారి పట్టిస్తూ వారసత్వ భూమిని కాజేసేందుకు యత్నించిన ఘటన నకరికల్లు మండలంలో వెలుగుచూసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని సర్వే నంబరు 346H లో ఉన్న 2.50 ఎకరాల వారసత్వ భూమిని షేక్ నబీ సాహెబ్ అనే వ్యక్తి నకిలీ పత్రాల ఆధారంగా తన పేరుపై ఆన్లైన్ చేయించుకున్నాడు. దీనిపై బాధితులైన 80 ఏళ్ల వృద్ధ సోదరులు సైదా సాహెబ్, ఎర్రబాబులు గతంలో ఎమ్మార్వో, ఆర్డీవో, పోలీసులతో పాటు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) లో ఫిర్యాదు చేశారు.
ఆర్డీవో ఆదేశాల మేరకు ఎమ్మార్వో నిర్వహించిన సమగ్ర విచారణలో భూమి నమోదు ప్రక్రియలో అక్రమాలు జరిగినట్లు స్పష్టంగా నిరూపితమవ్వడంతో అధికారులు ఆ ఆన్లైన్ నమోదును వెంటనే రద్దు చేశారు. అయితే, ఆన్లైన్ రద్దయినప్పటికీ సైదా సాహెబ్ ఊర్లో లేని సమయం చూసి నబీ సాహెబ్ బలవంతంగా పొలంలోకి ప్రవేశించి దమ్ము చేయించి వరి నాట్లు వేశాడు. ఈ విషయమై ప్రశ్నించేందుకు వెళ్లిన వృద్ధ రైతులను “ఈ పొలం నాది, నన్ను ఎవరూ ఏమీ చేయలేరు” అంటూ గొడ్డలితో నరుకుతానని తీవ్రంగా బెదిరించాడు.
వృద్ధాప్యంలో ఉండి, హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న తమపై బెదిరింపులకు పాల్పడుతూ, అధికారం అండతో భూమిని ఆక్రమించుకోవాలని చూస్తున్న నబీ సాహెబ్‌పై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, తమ భూమిని తమకు దక్కేలా రక్షణ కల్పించాలని కోరుతూ బాధితులు శుక్రవారం నకరికల్లు పోలీసులను ఆశ్రయించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, వృద్ధులపై దాష్టీకానికి దిగుతున్న వారిపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి న్యాయం చేయాలని స్థానికులు కూడా పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.
