యూఏఈ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఈటీసీఏ–యూఏఈ) ప్రతినిధులు ఆహ్వానించారు. శుక్రవారం నంది నగర్‌లోని కేటీఆర్ నివాసంలో ఆయనను కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం బతుకమ్మ వేడుకలకు సంబంధించిన పోస్టర్‌ను కేటీఆర్ చేతుల మీదుగా విడుదల చేశారు.
ఈటీసీఏ ఆధ్వర్యంలో గత 16 ఏళ్లుగా యూఏఈలో బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నామని ప్రతినిధులు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా బతుకమ్మతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈసారి అక్టోబర్ 11న దుబాయ్‌లోని అల్ అహిలి స్పోర్ట్స్ క్లబ్లో బతుకమ్మ సంబరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
గల్ఫ్ కార్మికుల సమస్యలపై ఆరా
ఈటీసీఏ ప్రతినిధులతో సమావేశమైన కేటీఆర్ గల్ఫ్ దేశాల్లోని తెలంగాణ కార్మికుల పరిస్థితులు, ఉపాధి అవకాశాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణకు దూరంగా ఉన్నప్పటికీ తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ బతుకమ్మ వంటి వేడుకలను నిర్వహిస్తున్న ప్రవాస తెలంగాణ సంఘాల కృషిని ఆయన అభినందించారు.
ఈటీసీఏ సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా గల్ఫ్ కార్మికుల కష్టనష్టాల్లోనూ అండగా నిలుస్తుండటం అభినందనీయమని కేటీఆర్ అన్నారు. గల్ఫ్‌లో తెలంగాణ కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
గల్ఫ్ దేశాల్లో వివిధ కారణాలతో చిక్కుకుపోయిన తెలంగాణవాసుల సమస్యల పరిష్కారానికి కేటీఆర్ గతంలో చూపిన చొరవను ఈటీసీఏ ప్రతినిధులు గుర్తుచేసి కృతజ్ఞతలు తెలిపారు. యూఏఈలోని తెలంగాణ ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ఈసారి బతుకమ్మ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
