మెండోరాలో సందడిగా బోనాల పండుగ

సంప్రదాయ వస్త్రధారణలో అలరించిన చిన్నారులు

భీమ్‌గల్ రూరల్‌, ఆగస్టు 8 (ఆంధ్రప్రభ): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను భీమ్‌గల్‌ మండలం మెండోరా ప్రాథమిక పాఠశాలలో శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారులు సంప్రదాయ వస్త్రధారణతో పాటు పోతురాజు వేషధారణలో ఆకట్టుకున్నారు. పాఠశాల ప్రాంగణంలో బోనాల పండుగ వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా మెండోరా సర్పంచ్‌ కుంట లక్ష్మీ రమేష్‌ మాట్లాడుతూ.. చిన్నారులకు చిన్ననాటి నుంచే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. బోనాల పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించిన పాఠశాల అధ్యాపక బృందాన్ని అభినందించారు. విద్యతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను పిల్లలకు పరిచయం చేయడం ద్వారా వాటి పరిరక్షణకు బాటలు వేయవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ముత్తెన్న, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గంగాధర్‌, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ కమిటీ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.